కువైట్ : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకార చర్య అని ఆమె ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకోవడం దుర్మార్గం అన్నారు. ఈ కేసులో ఏమీ లేదని సుప్రీం కోర్టు చెప్పినా, కాంగ్రెస్ కుటిల రాజకీయ నాటకాలు ఆడుతూ విపక్షాన్ని అణచివేయాలనే దురుద్దేశంతో చేస్తున్న చర్యగా అభివర్ణించారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన పాలకులు స్కాంల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని, మేమంతా కేసీఆర్కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.