హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ పోస్టుల భర్తీకి సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లో మొత్తం 17,291 పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు మే 20న రాత్రి 10 గంటల వరకు అవకాశం కల్పించారు. గ్రూప్-1, పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సజావుగా సాగేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు పూర్తిచేశాయి.
టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ఆధారంగా దరఖాస్తులు
స్టేట్ సివిల్ సర్వీసెస్ పోస్టులుగా పరిగణించే గ్రూప్-1 దరఖాస్తులను సోమవారం నుంచి మే 31 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు.18 శాఖల్లోని 503 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేసింది. టీఎస్పీఎస్సీ ఓటీఆర్ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండగా.. ఇప్పటికే అధికారులు ఓటీఆర్‌లో మార్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. శనివారం వరకు 1.40 లక్షల అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్‌లో మార్పులు చేసుకున్నారు.
గ్రూప్-1 ఏ పోస్టులకు ఏ విద్యార్హతలు..
రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో) ఉద్యోగాలకు బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఉద్యోగానికి డిగ్రీలో కామర్స్, ఎకనామిక్స్ లేదా గణితం సబ్జెక్టుల్లో కనీసంగా సెకండ్ క్లాస్‌లో పాసై ఉండాలి.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ వారు అర్హులే. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ /ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ స్పెషలైజేషన్‌తో సోషల్‌వర్క్ పీజీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు ఏదేని డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఇద్దరు అభ్యర్థులకు మార్కులు సమానంగా వస్తే సోషియాలజీ, సోషల్‌వర్క్‌లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
మిగతా అన్ని పోస్టులకు ఏదేనీ డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.
రద్దీకి తగ్గట్టుగా టీఎస్ఎల్పీఆర్బీ ఏర్పాట్లు
పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల కోసం మే 2 ఉదయం 8 గంటల నుంచి మే 20వ తేదీ రాత్రి 10 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో పోస్టుల భర్తీని మాత్రమే టీఎస్ఎల్పీఆర్బీకి ఇచ్చేవారు. తొలిసారిగా ఎక్సైజ్, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీని అప్పగించారు. అన్ని పోస్టులకు కలిపి 9 లక్షలకుపైనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి వారంలో కాస్త రద్దీ తగ్గువగా ఉండే అవకాశం ఉన్నందున దరఖాస్తు ప్రక్రియలో సాంకేతికంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు వాటిని సరిచేసేలా ఏర్పాట్లు చేశారు.
క్యాటగిరీవారీగా : జనరల్: మహిళ పోస్టులు
ఓసీ : 129 : 78
ఈడబ్ల్యూఎస్: 30 : 13
బీసీ -ఏ : 15: 22
బీసీ – బీ : 14: 17
బీసీ -సీ: 13 : 00
బీసీ -డీ : 09: 12
బీసీ -ఈ: 04 : 10
ఎస్సీ : 43 : 38
ఎస్టీ : 12: 19
వికలాంగులు : 08 : 16
స్పోర్ట్స్: 01 : 00
మొత్తం : 278: 225