భీమ్‌గల్, మే 16 : సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో భీమ్‌గల్ మండలం భీమ్‌గల్, బడాభీమ్‌గల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గోన్‌గొప్పుల గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు మంగ ళవారం బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వారికి గులా బీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరిన యువతకు హృదయపూర్వక స్వాగతమని, పార్టీలో చేరిక కోసం వచ్చిన వారంతా ఏదో ప్రచార ఆర్భా టం కోసం రాలేదని స్పష్టంగా కనిపిస్తుందని, పార్టీ నిర్మాణం కోసమే వచ్చారని, ఇలాంటి మార్పు యువతలో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
యువతను బీజేపీ దేశం కోసం అంటూ తప్పుదోవ పట్టిస్తూ అసత్యాలు ప్రచారం చేయిస్తూ ఓ భ్రమలోకి నెట్టిందని, కానీ యువతకు అన్ని విషయాలు మెల్లగా అర్థమవుతున్నాయన్నారు. మోదీ దోస్త్ అదానీకి దేశ ఆస్తులన్నీ చట్టాలను తుంగలో తొక్కి అప్పనంగా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2జీ వేలంలో అవినీతి జరిగిందని.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆరోపించిన మోదీ 5జీ విషయంలో 15 లక్షల కోట్ల మేర అవినీతి జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మోదీ దోస్తుల కంపెనీలకు 5జీ స్పెక్ట్రం అప్పనంగా కట్టబెట్టారన్నారు.
దేశంలో 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగా, ఇక్కడి బొగ్గు టన్నుకు రూ.3 నుంచి 5 వేలకు వస్తుందని కానీ ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గని నుంచి సుమారు 3 లక్షల కోట్ల బొగ్గు దేశానికి దిగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. అది రూ.30వేలకు టన్ను కొనాలని విద్యుత్ డిస్కంలకు ఆర్డర్ వేశారని దుయ్యబట్టారు. ఇట్లా ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఈడీ కేసు అంటేనే నేడు ఓ పెద్ద జోక్ అయిపోయిందన్నారు. ఈడీ కేసులు పెడుతున్నారు కానీ ఒక్క కేసులో కూడా నేరం రుజువు చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితమ్మ మీద కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. అసలు దేశం మొత్తాన్ని అన్ని రంగాల్లో దోచుకుంటున్న బీజేపీపై ఈడీ కేసులు పెట్టాలని, ఈడీ సీబీఐ విచారణ జరిపి మోదీ, అమిత్‌షా తమ సచ్చీలత నిరూపించుకోవాలని మంత్రి వేముల డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనే బాధ్యత ప్రధాని మోదీకి లేదా అని ప్రశ్నించారు. కేంద్రం తమ బాధ్యతను విస్మరించినా, రాష్ట్రంలో కేసీఆర్ రైతులకు భరోసా కల్పించారన్నారు.
రాష్ట్రంలో దేశంలో కేసీఆర్‌తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని మంత్రి వేముల స్పష్టం చేశారు. నేడు తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ అని పేర్కొన్నారు. దేశానికి, రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి పునరుద్ఘాటించారు.కార్యక్రమంలో ఎంపీపీ ఆర్మూ ర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సురేందర్, సర్పంచులు సంజీవ్, అనసూయ, నర్సయ్య, జ్యోతి, గంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.