వినాయక్ నగర్, జులై 10 : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. పానీ పూరి బండి నిర్వహించే యువకుడు ఫుట్ పాత్ పై నుండి తన బండి తొలగించారని ఆరోపిస్తూ తన వెంట బాటిల్లో తెచ్చుకున్న డీజిల్ ను ఒంటిపై పోసుకొని ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాలాజీ అనే యువకుడు నగరంలోని కంఠేశ్వర్ ఏరియాలో ఫుట్ పాత్ పై పానీపూరి బండి నిర్వహిస్తుండేవాడు.
ఈ మధ్యకాలంలో కేంద్ర హోం శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా కంఠేశ్వర్ ఏరియాలో ఉన్న తోపుడు బండ్లన్నీ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై నుండి తొలగించి వేశారు. కాగా, గురువారం బాలాజీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెళ్లి తాను వ్యాపారం చేసుకుంటానంటే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న డీజిల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు యువకుడిని అడ్డుకున్నారు. బాలాజీతో పాటు మరో ముగ్గురు యువకులు సైతం వచ్చారని వారు సెల్ ఫోన్లో వీడియో రికార్డు చేశారని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేశారన్నారు. స్టేషన్ ఆవరణలో న్యూసెన్స్ చేసిన యువకుడి పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే పనులకు పాల్పడిన వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ ప్రసాద్ హెచ్చరించారు.