పది మందిలో ప్రత్యేకంగా కనిపించేందుకు యువతులు అనేక బ్యూటీ టిప్స్ పాటిస్తుంటారు. మగువల అందాన్ని రెట్టింపు చేసేవాటిలో నఖ సౌందర్యం ఒకటి. అరచేతులు, గోళ్లకు గోరింటాకు పెట్టడం నాటి సంప్రదాయం.. నెయిల్ పాలిష్ వేసుకోవడం వంటి ఫ్యాషన్లు ఎప్పుడో పాతవైపోయాయి. ఇప్పుడు నడుస్తున్నదంతా నెయిల్ ఆర్ట్. రంగురంగుల పెన్నులు, బ్రష్‌లను ఉపయోగిస్తూ గోళ్ల అందాన్ని పెంచుకుంటున్నారు. గోళ్లనే కాన్వాస్‌గా మార్చి అందమైన బొమ్మలు, ఆకట్టుకునే డిజైన్లతో నఖ సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా మార్కెట్లోనూ రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. నెయిల్ ఆర్ట్‌కు ప్రస్తుతం చాలా డిమాండ్ ఏర్పడడంతో ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. నిరుద్యోగ యువతులు ఈ కళను నేర్చుకొని ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరికొందరు ఆసక్తి మేరకు నెయిల్ ఆర్ట్ నేర్చుకొని వీలైనప్పుడల్లా బంధువులు, చుట్టుపక్కల వారికి వేస్తున్నారు.
-ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 17
నెయిల్ ఆర్ట్ ఫ్యాషన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. పట్టణాలకే పరిమితమైన ఈ నెయిల్ ఆర్ట్ అంటే గ్రామాల్లోని యువతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. డ్రెస్సులు, హెయిర్ స్టయిల్‌తోపాటు గోళ్లపై అందమైన డిజైన్లు వేయించుకుంటున్నారు. సమీపంలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్లి మరీ గోళ్లకు సొబగులు అద్దుతున్నారు. మరికొందరైతే.. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో వచ్చే టుటోరియల్స్ను చూస్తూ నెయిల్ ఆర్ట్‌ను నేర్చుకొని ఉపాధి పొందుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని బ్యూటీపార్లర్లలో నెయిల్ ఆర్ట్ వేస్తున్నారు.