ఇందల్వాయి, జూన్ 8: డిచ్పల్లి మండలం సీఎంసీ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. సదరు నిందితుడి ఇంటికి మృతుడి కుటుంబీకులు, బంధువులు నిప్పటించారు. ఈ ఘటన ఇందల్వాయి మండలం మెగ్యానాయక్ తండాలో శనివారం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మెగ్యానాయక్ తండాకు చెందిన లకావత్ వెంగల్ (36) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు అదే రోజు సాయంత్రం ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
శుక్రవారం రాత్రి డిచ్పల్లి సీఎంసీ సమీపంలోని చెట్ల పొదల్లో వెంగల్ మృతదేహం లభించింది. అదే తండాకు చెందిన బిక్యాతో కలిసి వెంగల్ సీఎంసీ సమీపంలో మద్యం తాగాడు.
మద్యం మత్తులో వెంగల్ను బిక్యా హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, కుటుంబీకులు శనివారం ఉదయం బిక్యా ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు.
అనంతరం మృతుడి కుటుంబీకులు బంధువులు, తండావాసులు పెద్దసంఖ్యలో డిచ్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో విజయబాబు డిచ్పల్లి ఠాణాకు చేరుకొని తండాపెద్దలతో మాట్లాడారు. కుటుంబీకులు, బంధువులను సముదాయించారు. హత్య చేసిన నిందితులను పట్టుకుని, చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.