రుద్రూర్, మే 27: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందిన ఘటన రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం వీచిన ఈదురుగాలులకు రాయకూర్ క్యాంపు శివారులో చెట్లు మీదపడి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన షేక్ లతీఫ్(29) ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కిందపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు.. పోలీసులు, సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే యువకుడు చనిపోయాడని, విద్యుత్ స్తంభం విరిగి కిందపడిందని అధికారులకు సమాచారం ఇచ్చినా విద్యుత్ సరఫరా ఎలా చేస్తారని ప్రశ్నించారు. మృతు డి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని భీష్మించుకూర్చున్నారు. దీంతో విద్యుత్ శాఖ ఏడీ రవికుమార్, సీఐ జయేశ్రెడ్డి గ్రామస్తులను సముదాయించారు. సంబంధిత శాఖ నుంచి ఎక్స్గ్రేషియా వస్తుందని, అందుకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై అప్పారావు తెలిపారు.