వర్ని, ఏప్రిల్ 3: తనకు న్యాయం చేయాలని కోరు తూ ఓ యువకుడు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వాహనాన్ని అడ్డుకున్నాడు. సదరు యువకుడి సమస్యను తెలుసుకున్న కలెక్టర్ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్ని మండలం జలాల్పూర్ గ్రామం లో కలెక్టర్ గురువారం రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన అనంతరం జాకోరకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కుర్మ సాగర్ అనే యువకుడు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నాడు.
తమ కుటుంబానికి ప్రభుత్వం 20 ఏండ్ల క్రితం స్థలం ఇచ్చిందని, ప్రస్తుతం ఈ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు పునాదులు తవ్వే సమయంలో పక్కన ఉన్నవారు అడ్డుకుంటున్నారని వాపోయాడు. ఇదే విషయమై రెండు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదని కలెక్టర్ ఎదుట కంటతడి పెట్టాడు. తమ స్థలాన్ని కొలతలు తీసి, న్యాయం చేయలని కోరగా.. స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.