నాగిరెడ్డిపేట, జనవరి 4: పోచారం ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని జోన్ పరిధిలో యాసంగి పంటల కోసం ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన శనివారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు వేసిన నారు మళ్లు ఎండుతున్న విషయాన్ని నమస్తే తెలంగాణ శనివారం ప్రచురించింది.
దీంతో అధికారులు స్పందించి నీటిని విడుదల చేశారు. అనంతరం ఎస్ఈ విద్యావతి మాట్లాడుతూ.. ప్రాజెక్టులో 1.6టీఎంసీల నీరు ఉన్నదని, ఏ జోన్ పరిధిలోని 10,500 ఎకరాలకు యాసంగిలో సాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మల్లేశ్, డీఈఈ వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ రజిత, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పోచారం ప్రాజెక్టు వద్ద టూరిజం ఏర్పాటు కోసం 12.20 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఎస్ఈ విద్యావతి అన్నారు. ప్రాజెక్టు వివరాలను డీఈఈ వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు దిగువన ఉన్న పెద్ద వాగు వంతెన, ప్రధాన కాలువపై నూతన రహదారి నిర్మాణం కోసం చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు పాత గెస్ట్‌హౌస్, ప్రాజెక్టు మధ్యలో ఉన్న ఐలాండ్ వద్ద కలిపి 12.20 ఎకరాల భూమిని టూరిజం ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు.