నవీపేట/నందిపేట, ఏప్రిల్ 12: తనకు ఒక చెయ్యి లేకున్నా కుస్తీ పోటీల్లో పాల్గొని ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. ఒక్క చేతితోనే బరిలోకి దిగి విజేతగా నిలిచాడు మహారాష్ట్ర కు చెందిన గణేశ్ అనే మల్లయోధుడు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కర్కెల్లి గ్రామానికి చెందిన గణేశ్ .. 14 ఏండ్ల క్రితం ఓ రైతు వద్ద పశువుల కాపరిగా పనిచేసేవాడు.
ఓ రోజు గేదెలు పట్టాలు దాటుతుండగా,అదే సమయంలో రైలు వస్తుండడంతో వాటిని తప్పించే క్రమంలో పట్టాలపై గణేశ్ పడిపోగా కుడి చేతి నుజ్జునుజ్జు అ య్యింది. దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు కుడి చేతిని భుజం వరకు తీసేశారు. ఏ మా త్రం అధైర్యపడకుండా కూలీ పనులు చేస్తూ కుస్తీపై ఆసక్తి పెంచుకొని ఏడేండ్ల నుంచి పోటీల్లో పాల్గొంటున్నాడు.
శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నవీపేట మండలం అభంగపట్నం, నందిపేట మండలం అయిలాపూర్ గ్రామాల్లో వీడీసీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మల్లయోధుడు గణేశ్ పాల్గొన్నా డు. అభంగపట్నంలో నిర్వహించిన కుస్తీ పోటీలో నాందేడ్‌కు చెందిన గంగాధర్ అనే మల్లయోధుడిని చిత్తుచేశాడు.
దీంతో గ్రామ కమిటీ సభ్యులు గణేశ్‌కు రెండు తులాల వెండి కడియంతో పాటు రూ. 500 నగదును అందజేశారు. వీడీసీ అభినందించి రూ.వెయ్యి నగదు బహుమతి అందించింది. అయిలాపూర్‌లో ఇద్దరు ప్రత్యర్థులను మట్టికరిపించి, నగదు బహుమతి అందుకున్నాడు. ఒక చెయ్యిలేకున్నా కుస్తీ పోటీల్లో రాణించిన గణేశ్‌ను గ్రామస్తులు అభినందించారు.