డిచ్పల్లి, జూలై 1 : అన్నంలో పురుగులు రావడంతో ఆగ్రహించిన విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీలోని పీజీ న్యూ బాయ్స్ వసతిగృహం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్చారి మాట్లాడుతూ గతంలో చాలాసార్లు అన్నంలో పురుగులు వచ్చాయని, అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
చీఫ్ వార్డెన్ అక్కడికి చేరుకున్నా వీసీ రావాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. వర్సిటీలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కిచెన్లో కలియదిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీసీ అందుబాటులో లేరని, ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో మళ్లీ ఆందోళనలు చేపడుతామని విద్యార్థులు హెచ్చరించారు.