వేల్పూర్/మోర్తాడ్/బాల్కొండ, అక్టోబర్ 9: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 పింఛన్ ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికుల పింఛన్లు పెంచుతామన్నారు. గద్దెనెక్కి పది నెలలు అయినా వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మూసీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. వేల్పూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వేముల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింట్లో ఆడబిడ్డల పెండ్లి చేయడం ఎంత కష్టమో కళ్లతో చూసిన అప్పటి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఇది ఎంతో మంది పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిందన్నారు. అయితే, రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులందరికీ రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని వేముల విమర్శించారు. హామీలను అమలు చేయకుండా రూ.1.50 లక్షల కోట్లతో ఎవరికి పనికి రాని మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారని వేముల విమర్శించారు. కేసీఆర్ దసరా పండుగకు పేదింటి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, కాంగ్రెస్ పంపిణీ చేయలేదన్నారు.
తులం బంగారం ఇచ్చినప్పుడే కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేదుండే, ఇన్ని రోజులు ఆగినం. ఇంకా ఆగపోతుంటిమా, ఉన్నది ఒక్క బిడ్డే. పెండ్లిజేస్తిమి. అయిపాయే. ఇప్పుడు చెక్కు ఇచ్చినంక మల్ల బంగారమిస్తరా? అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. కమ్మర్‌పల్లిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న సమయంలో కొందరు మహిళలు ఎమ్మెల్యేను ఆపి మరీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ ఆందోళనను వ్యక్తంచేశారు. ‘తులం బంగారమన్నరు, సన్నబియ్యమిస్తమన్నరు, పింఛన్ పెంచుతమన్నరు. ఏ ఒక్కటి చెయ్యలేదు. పండుగ దగ్గరికొచ్చినా బతుకమ్మ చీరలు రాలే.’ అని వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రభుత్వంపై పోరాడుదామన్నారు.
వేల్పూర్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి విన్నవించాలని వేముల సూచించారు. దీంతో అక్కడే ఉన్న అధికార పార్టీ నేతలు గలాటా సృష్టించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఎన్నిక ల్లో ఇచ్చిన మాటను గుర్తు చేస్తుంటే అసహనానికి గురై, అనవసరంగా రాద్ద్దాంతం చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు నెరవేర్చాలని అడుగుతుంటే గత ప్రభుత్వంపై నిందలు మోపి తప్పించుకుంటున్నారన్నారు. మరోవైపు, అక్కడున్న మహిళలు కాంగ్రెస్ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీ ప్రభుత్వం వచ్చాకే మా బిడ్డలకు పెండ్లిలు అయ్యాయి. మీరు చెప్పినట్లు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాలని ’ డిమాండ్ చేశారు. సమావేశం ముగిశాక అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులను ఒక దగ్గరకు చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వమే చెక్కులు అందిస్తుందని ఏదో చెప్పబోయారు. దీంతో లబ్ధిదారులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు పెండ్లి రేవంత్‌రెడ్డి సీఎం అయినంకనే అయింది. మరీ నాకు తులం బంగారం ఎందుకు ఇవ్వరని’ ఓ మహిళ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించింది. దీంతో ఖంగుతిన్న అధికార పార్టీ నేతలు ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.