కంఠేశ్వర్ : మహిళలు అఘాయిత్యాలకు లోనుకాకుండా స్వయంశక్తి సాధించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధి పద్మావతి ( Civil Judge Padmavati ) అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురోగతి సాధిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం అర్సపల్లిలోని కురుమ సంఘం భవన్లో మహిళా దినోత్సవాన్ని (Womens Day) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సివిల్ జడ్జి మాట్లాడుతూ మహిళలు హింసకు గురైనప్పుడు గృహహింస చట్టం ద్వారా కావాల్సిన రక్షణ, మనోవృత్తి పొందవచ్చని సూచించారు. పిండ దశ నుంచే మహిళలు దాడులు ఎదుర్కొంటున్నారని, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలంటే ప్రతి మహిళా విద్యావంతురాలై ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగివుండాలని సూచించారు.
మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, తమ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పోక్సో యాక్ట్ (Pocso Act) , భరణం, విడాకులు, గృహహింస చట్టం, వరకట్నంకు సంబంధించిన మహిళా చట్టాలపై విద్యార్థినులకు వివరించారు. స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళా ఉద్యోగులను సన్మానించారు.
ఎన్నో పోరాటాలు , త్యాగాలతో సాధించుకున్న అనేక హక్కులపై ప్రపంచ వ్యాప్తంగా దాడి జరుగుతోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా పటిష్టంగా అమలు కావడం లేదని చెప్పారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే మనముందున్న ఏకైక మార్గమన్నారు.
ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుజాత , తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, అర్సపల్లి 15 వ డివిజన్ కార్పొరేటర్ ముంచుకురు లావణ్య నవీన్, వీడీసీ అధ్యక్షులు తూట్కూర్ నర్సయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిర్ప లింగం, డాక్టర్ షాబుద్దీన్, మహిళలు పాల్గొన్నారు.