వినాయక్‌నగర్, మే 27: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ మహిళను అటుగా వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి తన వాహనంలో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద కొత్త కలెక్టరేట్ వైపు స్కూటీపై వెళ్తున్న మహిళను అటుగా వచ్చిన కారు ఢీ కొట్టింది.
దీంతో స్కూటీ నడుపుతున్న మహిళ ఎగిరి కారు అద్దంపై పడింది. కారు నడిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని చితకబాదడానికి యత్నించగా అప్పటికే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి పోలీసు వాహనంలో వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన మహిళను తన పోలీస్ వాహనంలో ఎక్కించుకొని చికిత్స నిమిత్తం దవాఖానకు తీసుకెళ్లారు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.