Bichkunda | బిచ్కుంద, సెప్టెంబర్ 10 : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామానికి చెందిన సంధ్యారాణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేసి సమాచారమందించారు.
బిచ్కుంద 108 సిబ్బంది అక్కడికి చేరుకొని ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తాడ్కోల్ గ్రామం వద్ద ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మార్గమధ్యంలో పురిటి నొప్పులు అధికమవడంతో ఈఎంటి అనిల్, పైలెట్ కాశీనాథ్ చాకచక్యంగా వ్యవహరించి సాధారణ కాన్పు అయ్యేలా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.