గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీర పరవళ్లు తొక్కుతున్నది. భారీ వర్షాలతో రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కురిసిన వానలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో 32 వరద గేట్లను ఎత్తి 3.08 లక్షల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. ఇక, మంజీర సవ్వళ్లతో నిజాంసాగర్ పూర్తిస్థాయి మట్టానికి చేరింది. 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో నాలుగు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
మెండోరా, జూలై 27 : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులు ఉదయం 11 గంటల నుంచి మిగులు జలాలను వరదగేట్లను ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మూడు లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. 32 వరదగేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి లక్షా 54 వేల క్యూసెక్కుల జలాలను విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ఎస్కేప్ గేట్ల నుంచి 4 వేల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన భారీ వర్షంతో ఎగువ ప్రాం తం నుంచి మరింత వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవె న్యూ, పోలీసు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద ఉధృతి పెరిగితే దిగువ గోదావరిలోకి నీటి విడుదల పెంచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేసిన ఎంపీపీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో గురువారం ఉదయం మెండోరా ఎంపీపీ బురుకల సుకన్యా కమలాకర్, సర్పంచ్ మిస్బాతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు వరదగేట్ల బటన్ నొక్కి గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి వరదనీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి, ఏఈలు వంశీ, నయనారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎర్ర భాస్కర్, ఎస్కె.పాషా తదితరులు పాల్గొన్నారు.
Nizamabad4
నీటిమట్టం వివరాలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి 2,50,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఏఈఈ రవి తెలిపారు. 26 వరదగేట్ల నుంచి గోదావరిలోకి లక్షా 50 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 4 వేల క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేశామన్నారు. మిషన్ భగీరథ నీటి కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1088.40 అడుగులు(78.702 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 57 టీఎంసీల వరదనీరు వచ్చి చేరిందన్నారు. గతేడాది ఇదే రోజు ప్రాజెక్టు నీటిమట్టం 1087.60 అడుగులు, (75.146 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు.
జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
మెండోరా, జూలై 27: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ కాకతీయ నుంచి నీటి విడుదలను ఎంపీపీ బురుకల సుకన్యా కమలాకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జెన్కో కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని బటన్ నొక్కి ఎంపీపీ, సర్పంచ్ మిస్బా ప్రారంభించారు. రెండు టర్బాయిన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనట్లు డీఈ శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసిన నీటిని ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, ఈఈ చక్రపాణి, బీఆర్ఎస్ నాయకులు ఎర్ర భాస్కర్, జెన్కో సిబ్బంది ఉన్నారు.