నిజామాబాద్, జూలై 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్, కామారెడ్డి అడవుల్లో వన్యప్రాణుల రక్షణ గాలిలో దీపంలా మారినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా అడవిలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. బయో డైవర్సిటీకి ఆయువు పట్టులాంటి క్రూర మృగాలు తరచూ ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పులి కోసం వెతుకుతున్న క్రమంలో కమ్మర్పల్లి రేంజ్ అటవీ అధికారులు, పోలీసులకు రెండేళ్ల వయసు కలిగిన చిరుత పులి కళేబరం దొరికింది. పెద్ద పులి కోసం వేట కొనసాగిస్తున్న అటవీ, పోలీస్ బృందాలకు కొత్త వ్యవహారం చిక్కడంతో అవాక్కు తినాల్సి వచ్చింది.
భీంగల్ ఫారెస్ట్‌లో వెలుగు చూసిన ఈ ఘటన కూపీ లాగితే మరో లింక్‌ను పోలీసులు, అటవీ శాఖ ఛేదించారు. ధర్పల్లిలో కొంత మంది దుండగుల చేతుల్లో మరో చిరుత పులికి సంబంధించిన గోళ్లు, చర్మం, వాటి కోర పళ్లు లభించాయి. ఒకే సారి రెండు చిరుత పులులు మృత్యువాత పడిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. అడవిలో జంతువులకు రక్షణే లేదన్న వాస్తవం తేటతెల్లం అవుతోంది. భీంగల్ అడవిలో జాగిలాలతో పరిశోధన చేసిన పోలీసులకు నిందితుడు ఇట్టే దొరికిపోయినట్లు తెలిసింది. కొద్ది గంటల క్రితమే చిరుత మృతి చెందిన ప్రాంతానికి దుండగులు వచ్చి వెళ్లగా జాగిలం పసిగట్టింది. ఆరు కిలో మీటర్లు మేర పరుగులు తీసి దుండగుడు నివాసం వద్ద కూర్చోవడం పోలీసు, అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
చిరుత పులులను, పెద్ద పులులను వేటాడి చంపి వాటి గోళ్లు, చర్మం సేకరించేందుకు పెద్ద ముఠాలే పని చేస్తున్నట్లుగా అనుమానాలు బల పడుతున్నాయి. పోలీసులు నాలుగైదు రోజులుగా ఇదే వ్యవహారంపై కూపీ లాగుతుండగా వీస్తూ పోయే అంశాలు బయట పడ్డాయి. దుండగులు తుపాకులు పట్టుకుని అడవుల్లో వేటాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొంత మంది ఇదే పనిగా రాత్రి కాగానే అడవుల్లోకి చొచ్చుకొచ్చి క్రూర మృగాలను, జింకలను వేటాడి చంపుతున్నట్లుగా అర్థం అవుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్‌లో 40కి పైగా చిరుత పులులు ఉన్నాయి. వీటికి తోడుగా ఏడాది కాలంగా పెద్ద పులులు రాకతో అడవికి కొత్త అందం చేకూరినైట్లెంది.
వచ్చిన పులులు వచ్చినట్లే కనుమరుగు కావడంతో అడవి బోసిపోవాల్సి వస్తోంది. చిరుత పులి దాడులు, పాద ముద్రికలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగు చూడటం నిత్యకృత్యమవుతున్న ఘటనలే. జనావాసాల్లోనూ చిరుతలు వచ్చి పోతున్నాయి. పలు ప్రాంతాల్లో దాడులు చేస్తున్నాయి. అడవిలో చెట్లు నరికే వాళ్లతోనే ఎక్కువగా వన్య మృగాలకు ప్రాణ ముప్పు పొంచి ఉంది. గొడ్డళ్లు, కరెంట్ తీగలు, ఎయిర్ పిస్టోళ్లతో అడవి జంతువులను వేటాడుతున్నారు. లింగంపేట మండలంలో ఈ తరహా ముఠా గుట్టు గతంలో రట్టు చేయబడింది. ఇప్పుడు భీంగల్, ధర్పల్లి ఏరియాలో చిరుతలను చంపినట్లుగా తేలడంతో అంతటా చర్చనీయాంశం అవుతోంది.
కామారెడ్డి జిల్లాలో ఎస్12 పులి జాడ కనుమరుగైన తర్వాత నిజామాబాద్‌లో జె1 అనే మూడున్నరేళ్ల మగ పులి సైతం కనిపించడం లేదు. కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా అటవీ క్షేత్రాల్లో ఎక్కడుందో అంతు చిక్కడం లేదు. ఎటు నుంచి ఎటు వెళ్లిందో నిర్ధారణ కాలేదు. రెండు నెలల క్రితం కనిపించిన పులి ఆచూకి… ఆ తర్వాత ఎలాంటి ఆధారం దొరకలేదు. పెద్ద పులి ప్రాణాలతో ఉన్నట్లా? లేనట్లా? అనే చర్చ నడుస్తోన్న క్రమంలో భీంగల్, ధర్పల్లి అడవుల్లో చిరుత పులులు చనిపోవడం సంచలనంగా మారింది.
నిత్యం జాతీయ రహదారి 44పై రోడ్డు ప్రమాదాల్లో చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పిలు మృతి చెందుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో మరికొన్ని చని పోతున్నాయి. విష ప్రయోగాల్లోనూ మృత్యువాత పడుతుండటంతో అటవీ క్షేత్రాలు వెలవెలబోవాల్సి వస్తోంది. వరుస ఘటనలు అడవిలో జంతువుల ఆవాసాలకు రక్షణ ఉన్నదా? అన్న ప్రశ్నకు తావిస్తున్నట్లుగా మారింది. అడవి జంతువులను వేటాడుతున్న ముఠాలతో క్రూరమృగాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఏర్పడింది.