నిజాంసాగర్, మే 15: భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ వివాహిత నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన దార సాయిలు అప్పుల బాధతో ఏప్రిల్ 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుంచి అతడి భార్య ప్రమీల (29) తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. ఈ క్రమంలో నిజాంపేట్‌లోని బ్యాంకులో పని ఉన్నదని చెప్పి కొడుకు అక్షయ్ (7)ని తీసుకొని బుధవారం ఇంట్లో నుంచి బయల్దేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి ప్రాజెక్టు 20 గేట్ల వద్ద కొడుకుతో కలిసి నీటిలో దూకింది. నిజాంసాగర్‌లో చేపలు పట్టేవారు ఇద్దరి మృతదేహాలను గురువారం గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు.
మృతులు మునిగేపల్లికి చెందిన వారుగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ప్రమీల తండ్రి దుర్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మృతురాలికి కూతురు నిహారిక ఉన్నదన్నారు.