ఖలీల్‌వాడి, ఆగస్టు 10 : రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పోయి రద్దుల, రాక్షస ప్రభుత్వం వచ్చిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తోందని, మాఫీలు అమలు కాలేదని, కానీ హామీల మాఫీ అమలవుతున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో చెప్పారని, పాలనలో అన్నీ తప్పారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు గాలి మాటలు చెప్పి, గద్దెనెక్కినాక కూడా గాలి మాటలే మాట్లాడుతున్నారని అన్నారు.
ఇప్పుడు గాలి మాటలకు తోడు గాలి మోటర్ల తిరుగుడు ఇంతకు మించి ఏం జరగలేదన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 51 సార్లు ఢిల్లీకి, విదేశాలకు మూడు నాలుగు సార్లు వెళ్లారని, 21నెలల పాలనలో మూడు నెలలపైనే బయటే గడిపారన్నారు. సీఎంకు ట్రిప్పుల మీద ఉన్న మోజు రైతుల తిప్పలు తీర్చడంలో లేదని మండిపడ్డారు.
హామీలు ఏమయ్యాయని అడిగితే కు ట్రలు కుతంత్రాలకు తెర లేపుతున్నారని ఆ గ్రహం వ్యక్తంచేశారు. కమిషన్లు, విచారణ లు, అరెస్టుల పేరిట అడిగే వారిని భయపెట్టాలని, ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. కుంటిసాకులతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప రైతుల కడుపు నింపే పనులు చేయడం లేదన్నారు. రుణమాఫీ నుంచి రైతుభరోసా దాకా రేవంత్‌ది అంత మోసమే అని అన్నా రు. చారా ణా పని కూడా చేయలేదని, కానీ బారాణా ప్ర చారం చేసుకుంటున్నారని విమర్శించారు.
చంద్రబాబుకు గురుదక్షిణగా ఇవ్వడం కోసమే..
మేడిగడ్డను పండబెట్టి, బనకచర్ల కోసం గోదావరి నీళ్లను దోచిపెట్టి చంద్రబాబుకు గురుదక్షిణగా ఇవ్వడం కోసమే కాశేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని వేముల మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలవేళ కాళేశ్వరం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేసి, ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఘోష్ కమిషన్ రిపోర్టు అంటూ మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే దానిని బాగు చేసి రైతాంగానికి నీరు ఇవ్వాల్సింది పోయి, ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని, అవినీతి అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ బ్యారేజీ మొన్నటికీ మొన్న 5 లక్షల క్యూసెక్కుల వరదకు కూడా గట్టిగా తట్టుకుని నిటారుగా నిలబడిందని, చూసొద్దాం రావాలని సూచించారు. రెండు పిల్లర్లకు సమస్యలు వస్తే రిపేర్ చేయించలేని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని తనం వల్లే ప్రజాధనం దుర్వినియోగమవుతున్నదని విమర్శించారు. ఎన్నికలైన మరుసటి రోజు నుంచే సీఎం రేవంత్‌రెడ్డి రూ.70 కోట్లతో, లక్ష కోట్లతో, లక్షా 50 వేల కోట్లతో మూసి సుందరీకర ణ చేద్దామని ప్రకటించారని, వా టికి క్యాబినెట్ అనుమతులు న్నాయా అని ప్రశ్నించారు.
ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదు..?
కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఆగమేఘాల మీద వచ్చి రిపోర్టు ఇచ్చిందని, ఏపీ పోలవరం రెండుసార్లు కొట్టుకుపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రాజెక్టులు కూలాయని సుంకిశాల గోడ, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయాయని, వాటిపై ఎందుకు ఇప్పటికీ ఎన్డీఎస్ఏ రాలేదని నిలదీశారు.
ఇది కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్కు ఉదాహరణ కాదా అని పేర్కొన్నారు . కాళేశ్వరంలో చిన్న నష్టం జరిగితే కేసీఆర్, హరీశ్‌రావుదే బాధ్యత అంటున్న కమిషన్ రిపోర్టు మరి పెద్దవాగుకు గండి పడినా, సుంకిశాల కూలినా, ఎస్ఎల్బీసీ టన్నెల్ మొత్తం కూలి ప్రాజెక్టు పనికి రాకుండా పోయినా, చనిపోయిన వారి ఆచూకీ దొరక్కపోయినా ఇప్పటివరకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌పై కమిషన్ వేసి విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని, ఉత్తమ్‌ను ఎందుకు బాధ్యులను చేయరని నిలదీశారు.
బండి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వేముల పేర్కొన్నారు. ఫోన్ ట్యాంపింగ్లో కేటీఆర్‌కు సంబంధం లేకున్నా బండి సంజయ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక కేంద్ర మంత్రి స్థాయి హోదాలో ఉండి బజా రు భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాగే మాట్లడితే తెలంగాణ ప్రజలు , బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్‌కి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.