ఎల్లారెడ్డి, జనవరి 4: పోచారం ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు అందేలా నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. పోచారం ప్రాజెక్టు వద్ద యాసంగి పంటల కోసం గురువారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆలోచించి సాగు చేయాలని, వీలైతే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.
నీటిని వృథా చేయకుండా వినియోగించుకుంటేనే ఆయకట్టు చివరి రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎంపీపీ రాజ్దాస్, సర్పంచ్ వాసు రెడ్డి, నీటి పారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.