పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున్నారు. పంట చేతికి రాకుండా పోతుండడంతో పరేషానవుతున్నరు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కర్షకులకు సాగుకు నీటి కష్టాలు చుట్టుముడుతున్నాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రైతు కుదేలవుతున్నాడు. సాగునీటి కటకటతో అల్లాడుతున్నాడు. నెర్రెలు బారిన పొలాలను చూసుకుంటూ గుండెలు బాదుకుంటున్నాడు. భూగర్భ జలాలు అడుగంటుతుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇంతటి దుర్భర పరిస్థితులు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో నెలకొనడం గమనార్హం.
-నిజామాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ‘సాగు’ సవ్యంగా సాగింది. ఎటు చూసినా పచ్చదనం పరిచినంతగా పచ్చని పొలాలు కనిపించేవి. జల తరంగాల మధ్య రైతులు జోరుగా పంటలు సాగు చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగామారింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు లేకపోవడంతో రైతన్నకు ఇబ్బందులు తప్పడంలేదు. యాసంగికి నీటి కటకట ఎదురవుతుందని తెలిసినప్పటికీ రైతులను చైతన్య పర్చడంలో సర్కారు విఫలమైంది. దీంతో పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన వారికి చేతికి పంట డబ్బులైనా వస్తాయో? రావో? అనే ఆందోళన వెంటాడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకు రైతు భరోసా పథకమే అమలు కాలేదు. యాసంగి నుంచి పెట్టుబడి సాయం వేస్తామని సర్కారు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకూ డబ్బుల జమ సరిగా కావడం లేదు. ఓ వైపు పెట్టుబడి సాయం రాక, మరోవైపు అప్పులు తీసుకువచ్చి సాగుచేస్తున్న పంట కళ్లెదుటే ఎండిపోతుంటే రైతులు అల్లాడిపోతున్నారు.
నిజామాబాద్ జిల్లాలోనూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. బోరు బావుల నుంచి చుక్కా నీరురావడం లేదు. పొలాలకు నీరు తడిపేందుకు రైతు నానా కష్టా లు పడాల్సిన దుస్థితి. యాసంగిలో జిల్లాలో 5లక్షల 46వేల ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఇందులో 4లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 96వేల వ్యవసాయ బోరు కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటి మట్టం 10.09 మీటర్లకు పడిపోయింది. ఇందల్వాయి, డిచ్పల్లి, భీంగల్, మోపాల్, నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, చందూర్, రుద్రూర్ మండలాల్లో నీటి కొరతతో రైతులు దిగాలు చెందుతున్నారు. 10 మీటర్ల నుంచి 15మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. యాసంగి సాగు ప్రారంభం నుంచే కకావికలమవుతున్న రైతుకు భూగర్భ జలాలు లేకపోవడంతో పంటను కాపాడుకోలేక చతికిల పడుతున్నారు. ఎండుతున్న వరి పంటతో నష్టాలను మూటగట్టుకుంటున్నాడు. నష్టాల బారిన పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
యాసంగిలో వరి పైరు ఇప్పుడేకంగా పొట్ట దశకు చేరుకుంటున్నది. నెల రోజులైతే బాన్సువాడ ప్రాంతంలో కోతలు కూడా షురూ అయ్యే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితిలో భూములకు తడి లేక పంటలు ఎండి పోతున్నా యి. కామారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. వేసవి మొదలవ్వక ముందే ఈ దుస్థితి కనిపిస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. జనవరి నెలాఖరుకు భూగర్భ జల వనరుల శాఖ సేకరించిన లెక్క ల మేరకు జిల్లా సగటు నీటి మట్టం 10.95 మీటర్ల లోతుకు చేరింది. యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తం గా 3లక్షల 85వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, 2లక్షల 61వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 1.80 లక్షల ఎకరాల్లో వరి పంటను బోరు బావుల కింద సాగు చేశారు. ఎన్పీడీసీఎల్ గణాంకాల మేరకు జిల్లాలో లక్షా 10వేల బోర్లు ఉన్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గుతుండడం అన్నదాతలకు ఆందోళనకు గురిచేస్తున్నది. పిట్లం మండలం గోజెగావ్లో ప్రమాదకరంగా 30మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటాయి. భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, గాంధారి, రాజంపేట మండలాల్లోనూ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. గాంధారి మండలం గుర్జాల్‌లో 21.8మీటర్లు, రాజంపేట మండలం సిద్ధాపూర్లో 13.75మీటర్లు, భిక్కనూర్ మండలం మల్లుపల్లిలో 20.19మీటర్లు, తాడ్వాయి మండలం అన్నారంలో 15.78మీటర్లు, కామారెడ్డి శివారు అడ్లూర్‌లో 15.40మీటర్లలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు రోజురోజుకూ ఎండలు తీవ్రం అవుతున్నాయి. వరి పంట ప్రస్తుతం కీలక దశకు చేరింది. ఈ పరిస్థితిలో పంటలకు నీరు అత్యవసరం. పొట్ట కు వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అప్పు చేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందిస్తున్నారు. రైతుల దీనవస్థను చూసి ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు.
యాసంగి సాగు ప్రారంభంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయనే ధైర్యంతో ముందడుగు వేసిన. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోయినప్పటికీ సొంత పైసలతో పంటసాగుపై పెట్టుబడి పెట్టిన. బోరు ఎత్తి పోతుండడంతో నీరు లేక పంట ఎండుతున్నది. నాకేం దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– నారాయణ, కులాస్పూర్, మోపాల్ మండలం