గులాబీ దళపతిపై ప్రజాభిమానం వెల్లువెత్తుతున్నది. ఊరూరా ‘జయహో కేసీఆర్’ నినాదం ‘పల్లె’విస్తున్నది. సారు, కారుకే జై అని ప్రతి పల్లె నినదిస్తున్నది. కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న ముఖ్యమంత్రికి దండిగా మద్దతు లభిస్తున్నది. కేసీఆర్‌కే ఓటేస్తామని గ్రామాలకు గ్రామాలు స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తున్నాయి. పల్లెలన్నీ ఉద్యమ నేత వెంటే నడుస్తామని స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. అంతేకాదు, కేసీఆర్ ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలు అందజేస్తున్నాయి. బీఆర్ఎస్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్షాలు విలవిల్లాడుతున్నాయి. కేసీఆర్ సారు ఉండగా కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేసేదేలేదని ప్రజలు బహిరంగంగానే చెబుతుండడంతో ఎన్నికల్లో పోటీ చేయడంపై విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మొదట్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచేందుకు చాలా మంది ఆశావహులు పోటీపడ్డారు. కానీ కేసీఆర్ రంగంలోకి దిగాక వారంతా వెనుకడుగు వేయడం గమనార్హం. బీఆర్ఎస్ బలానికి, ప్రతిపక్షాల దుస్థితికి ఈ ఉదంతం అద్దం పడుతున్నది.
నిజామాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / మాచారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పెరుగుతున్నది. ఓ వైపు జనాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న మద్దతు, మరోవైపు ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు ఖాయమన్న సంకేతాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు డైలామాలో పడ్డారు. పోటీ చేయడమా? విరమించుకోవడమా? అనుకుంటూ తర్జనభర్జన పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తుండడం ఖాయమైంది. పీసీసీ ఆహ్వానించిన దరఖాస్తుల స్వీకరణలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేవలం మాజీ మంత్రి షబ్బీర్ మాత్రమే దరఖాస్తు చేశారు. కేసీఆర్ ప్రకటనకు మునుపు చాలా మంది ఆశావాహులు కామారెడ్డి బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపారు. షబ్బీర్‌కు వ్యతిరేకంగా పావులు కదిపారు. తీరా కేసీఆర్ రాక సందర్భంగా వారంతా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. షబ్బీర్‌ను ముందుకు నెట్టి తెర వెనుక బీఆర్ఎస్కు మద్దతు తెలియజేయాలన్న ఆలోచనకు వస్తున్నట్లుగా తెలుస్తున్నది. కేసీఆర్‌కు మద్దతు ఇచ్చేందుకు ప్రజలంతా కదిలి వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా షబ్బీర్ సొంత మండలం మాచారెడ్డిలో ఏకంగా తొమ్మిది జీపీల్లోని ప్రజలంతా కేసీఆర్‌నే గెలిపించుకుంటామంటూ శనివారం తీర్మానించడంతోపాటు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.90వేలు ఎన్నికల ఖర్చు కు డబ్బులు జమ చేశారు. పాల్వంచ మండలం మంథని దేవునిపల్లి గ్రామస్తులు రూ.25వేలు వితరణ చేసేందుకు సిద్ధమయ్యారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్‌కు స్వచ్ఛంద మద్దతు జోరు కొనసాగుతున్నది. మొన్న కామారెడ్డి మండలం గర్గుల్‌లో పలు కుల సంఘాల వారు ఏకగ్రీవంగా తీర్మానించగా.. ఇప్పుడు అదే స్ఫూర్తితో అనేక గ్రామాలు వరుస కట్టి కేసీఆర్‌కు జై కొడుతున్నాయి. రాష్ర్టాన్ని సాధించిన గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ప్రజలంతా ప్రతినబూనుతున్నారు. తాజాగా మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. జై కేసీఆర్… జై తెలంగాణ అంటూ నినదిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మినహా ఇతర ఏ పార్టీకీ ఓటెయ్యబోమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఆగస్టు 21న ప్రకటించగా వారం రోజుల్లోనే బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇదే రీతిలో కామారెడ్డిలోనూ ఏకపక్షంగా జనాల నుంచి మద్దతు లభిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
సీఎం కేసీఆర్‌కు కామారెడ్డిలో అపూర్వమైన స్పంద న లభిస్తున్నది. జనాలంతా ఒక్కొక్కరుగా బయటికి వచ్చి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నారు. మాచారెడ్డి మండలంలో శనివారం నిర్వహించిన ఏకగ్రీవ మద్దతు ప్రదర్శనలో గిరిజనులంతా కలిసి జై కేసీఆర్ అంటూ నినదించారు. మొత్తం తొమ్మిది జీపీల్లో కేసీఆర్‌కు మద్దతుగా తీర్మానాలు జరిగితే అందులో తొమ్మిది తండాలే ఉండడం గమనార్హం. సీఎం కేసీఆర్ పరిపాలనలోనే తండాలన్నీ జీపీలుగా రూపాంతరం చెందాయి. దీంతో వారంతా కేసీఆర్ కృషిపై విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై ఉన్న అభిమానం మేరకే ఇదంతా చేస్తున్నట్లుగా ప్రజలంతా కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్నారు. జనాల నుంచి స్పందన పెరుగుతుండడంతో ప్రతిపక్ష పార్టీల్లో జంకు మొదలైంది. ఎన్నికలు సమీపించే సమయానికి పోరు ఏకపక్షంగా మారే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జోరుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీకి అన్నివర్గాల నుంచి వస్తున్న మద్దతు నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తున్నది. బీజేపీలోనూ దయనీయ దుస్థితి నెలకొన్నది. ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములేక బీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని కాషాయ పార్టీ మొదలు పెట్టింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు సంసిద్ధం అవుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తొలినాళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. కేసీఆర్ అడుగులో అడుగై సమైక్య పాలకులకు వ్యతిరేకంగా స్వరాష్ట్రం కోసం పెద్ద ఎత్తున పోరు చేసిన చరిత్ర ఈ గడ్డకు ఉన్నది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎదురైన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచారెడ్డి మండలం చరిత్రకెక్కింది. అప్పటి నిజామాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా మాచారెడ్డి మండల పరిషత్ స్థానం టీఆర్ఎస్ కైవసం కావడం సంచలనంగా మారింది. ఇప్పుడదే మాచారెడ్డి మండలంలోని పలు గ్రామల ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు జై కొడుతూ స్వచ్ఛంద తీర్మానాలతో ఉద్యమ స్ఫూర్తిని చాటి చెబుతుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్వస్థలం కూడా మాచారెడ్డి మండల కేంద్రమే కావడం విశేషం. షబ్బీర్‌కు వ్యతిరేకంగా, కేసీఆర్‌కు అనుకూలంగా ఆయన సొంత మండలంలోనే మద్దతు తీర్మానాల జోరు హోరెత్తుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఆగమాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, నడిమితండా, వెనుకతండా, బోడగుట్ట తండా, అంకిరెడ్డిపల్లితండా, రాజ్‌ఖాన్ తండా, మైసమ్మ చెరువుతండా, గుంటి తండా, వడ్డెర గూడెం తండా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు జరిగాయి. ఎన్నికల నామినేషన్ ఖర్చులకు ఒక్కో జీపీ నుంచి రూ.10వేలు చొప్పున మొత్తం రూ.90వేలు జమ చేసి కేసీఆర్‌కు అందించబోతున్నారు. పాల్వంచ మండలం(పాత మాచారెడ్డి)లోని మంథని దేవునిపల్లిలో ప్రజలు ఏకంగా రూ.25వేలు జమ చేసి కేసీఆర్‌కు అందిస్తున్నట్లుగా ప్రకటించారు. మొత్తం రూ.1.15లక్షలు జమ చేసిన డబ్బులను గులాబీ బాస్‌కు అందిస్తారు.