రెంజల్(నవీపేట),6: గ్రామంలో కొంతకాలంగా సాగుతున్న మొరం అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ రెంజల్ మండలం నీలా శివారులో బోయి కులస్తులతో కలిసి గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. అక్రమార్కులు ప్రభుత్వ పనుల పేరిట అధికారుల నుంచి మూడు రోజులకు అనుమతులు పొందుతూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు బుధవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఏడు మొరం టిప్పర్లను అడ్డుకొన్నారు.
గురువారం ఉదయం ఘటనా స్థలంలోనే టెంట్ వేసుకొని ఆందోళన చేపట్టగా.. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఈఈ బలరాం, స్థానిక ఎస్సై సాయన్న, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో ఇరిగేషన్ ఈఈ బలరాం అక్రమంగా మొరం తరలిస్తున్న ఏడు టిప్పర్లను సీజ్ చేసి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యోగేశ్, నాయకులు రాఘవేంధర్, సుభాష్, రఘు, బోయి కుల సంఘం సభ్యులు గంగాధర్, అనిల్, భూమన్న, సాయిలు, పోశెట్టి గ్రామస్తులు పాల్గొన్నారు.
అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేశామని, జరిమానా విధిస్తామని ఇరిగేషన్ ఈఈ బలరాం తెలిపారు. నీలా ఖజానా కుంటలో మూడు ఫీట్ల మొరం తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని, కాంట్రాక్టర్ ఏడు ఫీట్ల వరకు తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం నీలా శివారులో మొరం తవ్వకాలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలతోపాటు సీజ్ చేసిన టిప్పర్లకు జరిమానా విధించాలని మైన్స్ ఏడీకి లేఖ రాసినట్లు తెలిపారు.