రుద్రూర్, జనవరి 28: మండలంలోని రాయకూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను అధికారులెవరూ పట్టించుకోవడంలేదని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి బిందెలు, బకెట్లతో చేరుకొన్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. కార్యదర్శిని లోపల ఉంచి కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. పది నెలలుగా నీటి సమస్య ఉన్నదని, పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తాత్కాలికంగా ఏదో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో మొత్తం 14 మోటర్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు.
వీటి ద్వారా ఇంద్రనగర్ కాలనీకి మాత్రమే నీరు సరఫరా అవుతున్నదన్నారు. అంబేద్కర్, ఛత్రపతి, ముస్లిం కాలనీల్లో నీటి సమస్య ఉన్నదని, రెండుమూడు రోజులకోసారి నీటి ట్యాంకర్‌ను పంపుతున్నారని మండిపడ్డారు. మోటర్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను విన్నవిస్తే డబ్బులు లేవంటూ చేతులెత్తేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు లేవంటూ కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, నిర్బంధించారు. తాగునీటి సమస్యను పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. నీటి సమస్యపై గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. డబ్బులు లేవని, ఏం చేయమంటారంటూ సమాధానమిచ్చారు. ఆందోళన చేసిన వారిలో గ్రామస్తులు శ్యామ్, సాయిలు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.