రామారెడ్డి, అక్టోబర్ 2: వైద్య సేవలు అందడంలేదంటూ సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు పీహెచ్సీ ఎదుట గ్రామస్తులు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, వైద్యురాలు శిరీష వారం రోజుల నుంచి దవాఖానకు రావడంలేదని తెలిపారు. దీంతో పీహెచ్సీ పరిధిలోని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాధుల బారిన పడి దవాఖానకు వెళ్తే వైద్య సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇటీవల జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఓ వ్యక్తి.. స్లైన్ పెట్టాలని వైద్య సిబ్బందిని అడిగితే దురుసుగా వ్యవహరించారని తెలిపారు. బుధవారం ఉదయం దవాఖానకు వెళ్తే వైద్యులెవరూ లేరని, సమయపాలన పాటించడంలేదన్నారు. వైద్య సిబ్బంది సకాలంలో హాజరుకావడంలేదని ఆరోపించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పీహెచ్సీలో రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఈ విషయమై డాక్టర్ శిరీషను అడుగగా తాను మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నానని, వ్యక్తి గత సమస్యలతో వారం రోజుల నుంచి సెలవులో ఉన్నట్లు తెలిపారు.
ఉత్తునూర్ పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు సరైన వైద్యం అందడలేదు. వైద్యులు సకాలంలో రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. సిబ్బందిని అడిగితే డాక్టర్ లేరని, మందుగోళీలు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో అధికారులు వెంటనే స్పందించి మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నాం.
-దోడ్లే నరేందర్‌రావు , ఉత్తునూర్ వీడీసీ అధ్యక్షుడు