ఆర్మూర్టౌన్, ఆగస్టు 22 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. ఆ ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఆమె ఆలూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు సుపరిపాలన అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రైతుభరోసా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు అందక రైతులు దిక్కుతోచని స్థితితో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని, ఆయనతోనే ప్రజలు, రైతులకు మేలు జరుగుతున్నదనే ఆశతోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు చెప్పారు. ఈ నెల 25న హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు విజయ భారతి ప్రకటించారు.