నిజామాబాద్: క్రమ శిక్షణకు మారుపేరే విజయ్ విద్యా సంస్థలని, అవి ఈ స్థాయిలో ఉన్నాయంటే ఆ నాటి అమృత లత సంకల్పమే 45వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామని ప్రఖ్యాత సినీ నటి, దర్శకురాలు రోహిణి, ప్రఖ్యాత రచయిత సినీ దర్శకుడు డాక్టర్ ప్రభాకర్ జైని, రచయిత కవిత్రి అండ్ కాళోజీ అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి అన్నారు. విజయ్ పాఠశాల 45 వ టాలెంట్ షో ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిణి, గౌరవ అతిథిగా డాక్టర్ ప్రభాకర్ జైని, గౌరవ అధ్యక్షురాలుగా నెల్లుట్ల రమాదేవి, విజయ్ విద్యాసంస్థల కార్యదర్శి అమృతలత లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టాలెంట్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడుతూ.. విజయ్ పాఠశాల 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. తాను చదివిన పాఠశాలను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విజయ విద్యాసంస్థల్లో ఒక పండుగ వాతావరణం కనిపించిందని చెప్పారు. తనను పాఠశాల యాజమాన్యం సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. చదువుతున్న సమయంలో తమకు ఉపయోగపడే ఆటలు, పరీక్షలు, క్రీడలు, ప్రతి దానిలో పోటీ పడే ప్రయత్నం చేయాలని, పోటీ చేయడం వలన అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రయత్నిస్తే పోయేది ఏమి లేదన్నారు. నిజామాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
విజయ్ హై స్కూల్ 45 ఏండ్లుగా విజయ పతాకంతో ముందుకు సాగుతుందంటే అమృతలతకు మాత్రమే సాధ్యమైందని డాక్టర్ ప్రభాకర్ జైని అన్నారు. చదువు ఒకటే కాదు చిన్నతనం నుంచే అన్ని విషయాలు తెలుసుకోవడం, ఆచరించడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణలో తాను చేసిన సినిమాకు అన్యాయం జరిగిందని, అడిగితే జురీ అవార్డుతో సరిపెట్టారని చెప్పారు. కాళోజీ సినిమాను తెలుగులో తెరకెక్కించిన ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలన్నారు.
గత నలభై ఐదు ఏండ్లుగా నడుపబడుతున్న విద్యావ్యవస్థ విజయ్ పాఠశాల విజయ పతాకంతో ముందుకు సాగుతుందని నెల్లుట్ల రమాదేవి చెప్పారు. డాక్టర్ అమృతలత రచయితగా, రాజకీయ వేత్తగా వివిధ రంగాలలో ప్రవీణ్యురాలై విద్యార్థులను తీర్చి దిద్దుతున్న ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. 45 సంవత్సరాలుగా సంరక్షిస్తూ ముందుకు వెళుతున్న అమృతలతకు పాదాభివందనాలు అని తెలిపారు. సంకల్పం చాలా గొప్పది కాబట్టి, మహా వృక్షంగా ఎదుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందడంలో విజయ్ హై స్కూల్ మహిళా శక్తిని నిరూపించుకుంటుంది. అమృతలతా అమ్మ ఒక సామాజిక వెత్తగానే కాకుండా అన్ని రకాలుగా గొప్ప మనస్తత్వం కలిగిన వారని పేర్కొన్నారు. పట్టుదల, ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అమృతాలత జీవితంలో నిరూపితమైందని ఆనందం వ్యక్తం చేశారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు..
వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు. అంతకు ముందు ముఖ్య అతిథులను విజయ్ పాఠశాల తరఫున మెమెంటో, శాలువాలతో సత్కరించారు. సినీ పాటలపై చిన్నారులు, విద్యార్థులు చేసిన డాన్స్ లు , భరతనాట్యం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అమృతలత, రమాదేవి, లలిత దేవి, విజయ భారతి, విజయ లక్ష్మి, మధు, కరస్పాండెంట్ ప్రభాదేవి అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.