శక్కర్‌నగర్, జూలై 4: ఎడపల్లి మండలంలోని అంబం (వై) గ్రామానికి చెందిన నీరడి విఠల్ కల్తీకల్లు తాగడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు, బంధువులు శనివారం బోధన్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బోధన్ పట్టణ శివారులోని నర్సాపూర్ గేట్ వద్ద ఓ కల్లు దుకాణం వెనుక భాగంలో శుక్రవారం నీరడి విఠల్ మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన గుంత లక్ష్మణ్ అపస్మారక స్థితికి చేరిన విషయం విదితమే.
కల్తీకల్లు తాగడంతోనే విఠల్ మృతి చెందాడని ఆరోపిస్తూ సదరు బాధిత కుటుంబీకులు, బంధువులు, గ్రామానికి చెందిన నాయకులతో కలిసి బోధన్ ఎక్సైజ్ ఆఫీస్‌కు తరలివచ్చారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ వెంకట నారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేయడంతోవారికి చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ వెంకట నారాయణ హామీ ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబీకులు ఆందోళన విరమించారు. అనంతరం దవాఖానా నుంచి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు.