నిజామాబాద్, నవంబర్ 14, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీని కుదిపేస్తున్న 2012 నోటిఫికేషన్ రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు వారాలుగా హై కోర్టు తీర్పు కాపీలు తమకు రాలేదం టూ టీయూ వీసీ, రిజిస్ట్రార్లు బుకాయిస్తున్నారు. ఈ వ్యవహారంలో తీర్పు ను అమలు చేసేందుకు మొండికేస్తున్న వీసీ, రిజిస్ట్రార్ తీరుతో విసిగి పోయిన బాధితుడు వెంకట్ నాయక్ ఏకంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనానికి వచ్చారు. వీసీ, రిజిస్ట్రార్లను కలిసేందుకు గంటల పాటు నిరీక్షించారు.
వీసీ అందుబాటులో లేకపోవడంతో రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరిని వెంకట్ నాయక్ కలిశారు. జస్టీస్ నగేశ్ భీమపాక వెలువరించిన 24 పేజీల తీర్పు కాపీని యాదగిరికి అందించారు. తీర్పు ప్రతులపై 2012 నోటిఫికేషన్ల రద్దుకై న్యాయపోరాటం చేసిన అడ్వకేట్‌తో సెల్ఫ్ అటెస్టెడ్ చేయించినట్లు తెలిసింది. 13 ఏళ్ల పాటుగా 2012 నోటిఫికేషన్ల ద్వారా నియామకైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై వెంకట్ నాయక్ రాజీలేని పోరాటం చేశారు.
హైకోర్టు స్టే ఆర్డర్‌ను ఉల్లంఘిస్తూ అక్బర్ అలీఖాన్ ఇచ్చిన నియామక ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుదీర్ఘంగా పోరాడారు. అక్టోబర్ 31న హైకోర్టు తీర్పు వెలువరిస్తే రెండు వారాలు దాటినప్పటికీ నోటిఫికేషన్లను రద్దు చేయకపోవడంపై వెంకట్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏ కారణంతో హైకోర్టు తీర్పు అమలు కావడం లేదని నిలదీస్తే మోనం తప్పా రిజిస్ట్రార్ సీట్లో కూర్చున్న ప్రొ.యాదగిరి నోరు విప్పలేదని తెలిసింది. అధికారికంగా తీర్పు కాపీ తమకు రాలేదంటూ తప్పించుకున్నట్లుగా సమాచారం.