మోర్తాడ్, జూన్ 2: 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంచేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా, అన్ని రంగాల్లో దిక్సూచిలా నిలిపారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో వేముల పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర, జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, మహిళలు, సబ్బండ వర్ణాలు ఒక్కటై నిలిచి ‘మా తెలంగాణ మాకు కావాలి’ అంటూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారని తెలిపారు. ఎందరో యువకులు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు సమైక్యపాలకులకు ఎదురొడ్డి ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ సిద్ధించాక కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని జనరంజక పాలన అందించారన్నారు.
రైతుబం ధు, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబీమా లాంటి పథకాలను మీరు కూడా అమలు చేయండి అంటూ కేంద్రం, ఇతర రాష్ర్టాలకు సూచించే స్థాయికి తెలంగాణను కేసీఆర్ ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమపాళ్లలో తీసుకెళ్లారని తెలిపారు. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందింది అనడానికి మూడు కొలమానాలు ముఖ్యమని, అవి తలసరి ఆదా యం, జీఎస్డీపీ పెరుగుదల, విద్యుత్ వినియోగం అని చెప్పారు.