మోర్తాడ్, మార్చి 8: జిల్లాకు పసుపుబోర్డు వస్తే పసుపునకు మంచి ధర వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పేరుకే పసుపు బోర్డు ను ఏర్పాటు చేశారని, నామమాత్రపు ఎంఎస్పీ ఇస్తున్నారని పేర్కొన్నారు. పసుపుబోర్డు వస్తే క్వింటాలుకు రూ.15వేల మద్దతు ధర ఇవ్వాలని, ఎందుకు ఇవ్వడంలేదని కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ.12వేల మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రైతులకు వచ్చే ధరకు రూ.12వేలకు తగ్గిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వకుండా రైతులను గోస పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
శనివారం ఆయన మోర్తాడ్ మండలంలో పర్యటిస్తుండగా పాలెం గ్రామంలో పసుపురైతులు కలిసి తమ గోడును విన్నవించారు. దీంతో వేముల వెంటనే కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటైనా పసుపునకు మద్దతు ధర కరువైందన్నారు. జిల్లా రైతులు సాంగ్లీవైపు చూసే పరిస్థితులు ఏర్పడినా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పసుపురైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన నిలబడి, వారి కోసం ఉద్యమిస్తామన్నారు. గంజ్‌లో పసుపు రైతులకు నష్టాలు కలిగించేలా పరిస్థితులు కొనసాగితే సహించేదిలేదన్నారు. పాలక వర్గం, దళారులు సిండికేట్‌గా మారి పసుపు ధరను తగ్గించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు.
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. కొమ్ము పసుపునకు రూ.10 వేలు, మండ పసుపునకు కనీస మద్దతు ధర రూ.9 వేలు కటాఫ్ నిర్ణయించిన తర్వాత ఇప్పుడు కటాఫ్‌ను తగ్గిస్తున్నట్లు రైతులు దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సిండికేట్ ఆగడాలను అరికట్టి కటాఫ్ ఎట్టిపరిస్థితులో తగ్గకుండా చూడాలని సూచించారు. ఆరంభంలో నిర్ణయించిన కొమ్ముకు ఉన్న కటాఫ్ రేట్‌ను రూ.10వేల నుంచి రూ.9 వేలకు, మండకు రూ.9వేలను కాస్తా రూ.8 వేలకు తగ్గించినట్లుగా రైతులు చెప్తున్నారని, ఒకసారి నిర్ణయించిన ధరను తిరిగి తగ్గిస్తే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ధర ను తగ్గించే ప్రయత్నం చేస్తున్న వారిపై వెంట నే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది పసుపునకు మంచి ధర వచ్చిందని రైతులు ఈసారి కూడా ఎంతో ఆశతో పసుపుపంటను పండించారని తెలిపారు. కానీ గంజ్‌లో నడుస్తున్న నాటకాలతో రైతులు మోసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇదే కొనసాగితే రైతులతో కలిసి ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.