కంఠేశ్వర్, ఏప్రిల్ 25 : కాంగ్రెస్ పాలన తీరుపై విసుగు చెందిన ప్రజలు రేవంత్ వద్దు.. కేసీఆర్ ముద్దు అంటు న్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇది జన నినాదమని పేర్కొన్నా రు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 40 వేల మంది తరలిరానున్నారని తెలిపారు. సభకు వెళ్లడానికి 2,400 వాహనాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వరంగల్ సభకు 40 వేల మంది స్వచ్ఛందంగా తరలడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
50వేలు దాటినా ఆశ్చర్యపోనవసరంలేదన్నారు. వీరి కోసం 250 ఆర్టీసీ, 264 ప్రైవేట్ బస్సులు, 626 తుఫాన్లు, సొంత కార్లు 1266 అందుబాటులో ఉంచినట్లు వేముల తెలిపారు. వరంగల్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి, కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. వరంగల్ సభ కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని, న భూతో న భవిష్యత్తు అనే విధంగా సభ జరగనున్నదని పేర్కొన్నారు. సభను విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, గంప గోవర్ధన్, షకీల్, సురేందర్, హన్మంత్ షిండే అందరం సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని వేముల పేర్కొన్నారు. 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించిట్లు తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత పదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా కేసీఆర్ నిలబెట్టారని అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే తెలంగాణను విధ్వంసం చేశారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు సంక్షేమమైతే, రేవంత్‌రెడ్డి పాలన 17 నెలల విధ్వంసమన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు విని తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు.
ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అడిగినందుకు బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి, 33 మందిపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమం గాలికొదిలి, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకోనిదే బిల్లులు మంజూరు చేయడంలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతున్నదని, కమీషన్ లేనిదే ఏ పని కావడంలేదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గోల్మాల్ గోవిందంగా తయారైందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో దోచుకుని ఢిల్లీకి మూటలు కడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో ఎవరైనా నీతిమంతులు ఉంటే, రేవంత్‌రెడ్డిని వెంటనే దించేసి ఆ పదవిని చేపట్టాలని సూచించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మాజీ మేయర్ నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, మాజీ జడ్పీటీసీలు జగన్, గడ్డం సుమన, నాయకులు సత్య ప్రకాశ్, సిర్ప రాజు, సుజిత్‌సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.