మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాలు తప్పుల కుప్పగా మారాయి. ఇటీవల ప్రకటించిన ఓటర్ లిస్టులు గందరగోళానికి తెర లేపాయి. మున్సిపల్ రికార్డుల్లో ఎక్కడాలేని ఇళ్ల బైనంబర్లతో ఓటర్లు ఉండడం తప్పుల తడకకు నిదర్శనంగా మారింది. కొన్నిచోట్ల ఒక వార్డు ఓటర్ల పేర్లు మరో వార్డులోకి చేర్చగా, కొన్నిచోట్ల స్థానికంగా నివాసముండని వారి పేర్లను ప్రచురించారు. ఇక, చనిపోయిన వారి పేర్లను సైతం జాబితా నుంచి తొలగించలేదు.
తప్పుల తడకగా మారిన ఓటర్ జాబితాలను చూసి అటు రాజకీయ పార్టీలతో పాటు ఆశావాహులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఎన్నడూ చూడని పేర్లు జాబితాల్లో కనిపించడం చూసి అయోమయానికి గురవుతున్నారు. తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్న ఈ ఓటర్ జాబితాలతో ఎన్నికలు నిర్వహించొద్దని, వెంటనే ప్రక్షాళన చేయాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు, ఓటరు జాబితాలపై ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరా తీశారు.
బోధన్, జనవరి 5: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రచురించిన ఓటరు జాబితాలు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నాయి. బోధన్ మున్సిపాలిటీ వార్డుల వారీగా ప్రకటించిన ఓటర్ల జాబితాల్లో భారీగా తప్పులు దొర్లాయి. ఏదో అక్కడక్కడ చిన్నచిన్న తప్పులు ఉంటే ఫర్లేదు కానీ, ఆయా వార్డుల ఓటర్ల జాబితాల్లో పెద్ద సంఖ్యలో తప్పులు ఉండడంతో ఓటర్లు విస్మయం చెందుతున్నారు. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా, తప్పులు లేని వార్డు ఓటర్ల జాబితా ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవటం గమనార్హం. సగానికి పైగా వార్డుల ఓటర్ల జాబితాల్లో 50-80 వరకు ఓటర్ల పేర్లు తప్పుగా ఉండటమో, వేరే వార్డుల ఓటర్లు వచ్చి చేరటమో.. లేదా చనిపోయిన ఓటర్ల పేర్లు ప్రత్యక్షమవటమో జరిగాయి.
ఒక వార్డు పరిధిలోని ఓటర్ల పేర్లు ఎక్కడో దూరంగా ఉన్న మరో వార్డులో ప్రత్యక్షం కావడం, సంబంధిత వార్డులో ఎన్నడూ నివసించని అపరిచిత ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించడం, మున్సిపల్ రికార్డుల్లో ఎక్కడాలేని ఇళ్ల బైనంబర్లతో ఓట్ల ఉండటం.. ఇలా బోధన్ మున్సిపాలిటీ ఓటరు జాబితా గందరగోళంగా కనిపిస్తున్నది. ఆయా వార్డుల రాజకీయ పార్టీల నాయకులు ఈ ఓటర్ల జాబితాలను చూసి తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలు తమకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చాయని, లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వచ్చినట్లయితే పరిశీలిస్తామని చెబుతూ మున్సిపల్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
వాస్తవంగా ఉన్న ఇంటి నంబర్లకు ఓటరు జాబితాలో బై నంబర్లు సృష్టించి, ఆయా ఇళ్లలో ఓటర్ల పేర్లు చూపించటమన్నది అనేక వార్డుల ఓటరు జాబితాల్లో కనిపిస్తున్నది. ఈ బైనంబర్ల ఇళ్లలో ఉన్న ఓటర్లకు ఆ వార్డులతో ఎటువంటి సంబంధం లేదు. దొంగ ఓట్ల కోసం ఇలా ఎవరైనా అపరిచితులను ఓటర్లుగా చేర్చరా..? లేదా సాంకేతిక సమస్యల వల్ల ఓటర్ల జాబితాలో అపరిచితుల పేర్లు చోటుచేసుకున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ బైనంబర్ల ఇళ్ల వివరాలు మున్సిపల్ రికార్డుల్లో ఎక్కడా లేవు. వాస్తవంగా ఉన్న ఇంటి నంబర్‌కు పదుల సంఖ్యలో బై నంబర్లు సృష్టించటం ఎలా జరిగిందన్నది అంతుబట్టడం లేదు. ఈ బై నంబర్ల విషయమై ఆన్లైన్లో చూడగా, ఆయా ఇళ్లలో ఓటరు జాబితాలో ఉన్న పేర్లు, ఆ బైనంబర్లు కనిపించటం లేదని చెబుతున్నారు.