భీమ్‌గల్/వేలూర్, జూలై 29: విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు మారినా, గత ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత సర్కారుపై ఉందన్నారు. భీమ్‌గల్, ముచ్కూర్ హైస్కూళ్లలోని విద్యార్థుల సౌకర్యార్థం ప్రముఖ వ్యాపారవేత్త దయానందరెడ్డి అందించిన రూ.2 లక్షల విలువైన డ్యూయల్ డెస్క్ బెంచీలను వేముల బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద నియోజకవర్గంలోని అనేక పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయని వేముల గుర్తు చేశారు. ముచ్కూర్‌లో కాంట్రాక్టర్లు సొంత నిధులతో శ్లాబ్ పనులు పూర్తి చేశారని, సుమారు రూ. 30 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్పప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. పెండింగ్ బిల్లుల కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనే ఆర్థిక మంత్రికి చెప్పానని, అలాగే గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీశ్రావ్తో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయాన్ని బలంగా లేవనెత్తుతానని చెప్పారు. స్థానిక అధికార పార్టీ నాయకులు రాజకీయాలు పక్కన పెట్టి పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గురువుల ఆశీస్సులతోనే జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి, కష్టపడి వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న దయానంద్‌రెడ్డి లాంటి వ్యక్తులు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ప్రతి ఏటా తన సంపాదనలో 5-10 శాతం సమాజ సేవకు కేటాయిస్తూ విద్యా సంస్థలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. విద్యార్థులు కూడా బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకుని భవిష్యత్తులో తమ గ్రామాలకు, పాఠశాలలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఇటీవల ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు నేలపై కూర్చుని చదువుతున్న దుస్థితి చూసి దయానంద్‌రెడ్డి సహకారంతో 40 డెస్క్ బెంచీలను అందించామన్నారు. పలు పాఠశాలలకు సైన్స్ కిట్లు కూడా అందించినట్లు గుర్తు చేశారు. ముచ్కూర్ పాఠశాలకు సైన్స్ కిట్ అవసరమని ఉపాధ్యాయులు కోరగా, దయానంద్‌రెడ్డి సహకారంతో అందించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన రాజకీయ లక్ష్యమని, పేద విద్యార్థులకు అండగా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దాతలను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, నేతలు చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేశ్, నీలం రవి, భగత్, నర్సయ్య, మల్లెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.