వేల్పూర్, జూలై 8: ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఓటర్లకు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశముందని స్పష్టం చేశారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్‌లో ఎన్యూమరేషన్ పత్రాలను భర్తీ చేసి, బూత్ లెవల్ అధికారులకు స్వయంగా అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, రసీదుగా మరో ఫారాన్ని తన వద్ద ఉంచుకున్నారు. అనంతరం వేముల మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హులైన ప్రతి ఓటరూ తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి, సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్లు తమ వివరాలను ఈ నెల 23 లోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, బీఎల్వోలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి వారికి ఇవ్వాలన్నారు. మొత్తం రెండు ఫారాలుంటాయని ఒకటి బీఎల్వోకు అందజేసి, అధికారుల సంతకమున్న మరో ఫారాన్ని (రసీదు) ఓటర్లు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఫారాలు నింపి, అధికారులకు సమర్పించకపోయినా లేదా ఆన్లైన్లో నమోదు కాకపోయినా ఓటు గల్లంతయ్యే ప్రమాదముందని అప్రమత్తం చేశారు.
ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు బూత్ లెవల్ అధికారులకు ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. బీఎల్వోలు గ్రామపంచాయతీ కార్యాలయాలు, గుడులు లేదా సంఘ భవనాల్లో ఒకే దగ్గర కూర్చుని వివరాలు రాయడం సరికాదన్నారు. ఇంటింటికీ స్వయంగా వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు సేకరించాలని సూచించారు. బీఎల్వోలు ఒకే దగ్గర కూర్చుని పని చేస్తే ప్రజల ఓట్లు గల్లంతయ్యే అవకాశముందని, ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించిన తర్వాతే ఆన్లైన్ చేయాలన్నారు. సర్ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లే సమయంలో ఏజెంట్లు కూడా వారితో పాటు వెళ్లి ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా చూడాలని, ప్రతి ఒక్కరితో ఓటరు వివరాలు నమోదు చేయించాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ అనిరుధ్, బీఎల్వోలు, సర్పంచ్ అశోక్ ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.