భీమ్‌గల్, జనవరి 22: ప్రజాపాలన గ్రామ సభలు పేరుకే నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే అంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అన్ని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇస్తే ఇక గ్రామసభలు, అధికారుల సర్వే ఎందుకని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభలన్నీ బోగస్ సభలని విమర్శించారు.
బుధవారం ఆయన వేల్పూర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజాపాలన, గ్రామసభల పేరిట ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. హామీలు అమలుచేయాలని అడిగితే అప్లికేషన్ల పేరిట ప్రజలను జిరాక్స్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ఏడాదికాలంగా తిప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇప్పటి వరకు ఒక్కహామీ కూడా సక్రమంగా నెరవేర్చడంలేదన్నారు. మొదటిసారి మండల పరిషత్ కార్యాలయం, రెండోసారి ప్రజాపాలన అంటూ దరఖాస్తులు తీసుకున్నారని, ముచ్చటగా మూడోసారి ఇంటింటి సర్వేలో వివరాలు తీసుకున్నారని తెలిపారు. ఏడాది తర్వాత ఇప్పుడు నాల్గోసారి గ్రామసభలో దరఖాస్తులు ఇవ్వాలంటూ చెబుతున్నాడని మండిపడ్డారు. ఏడాది పొడవునా ఇచ్చిన దరఖాస్తులు ఎటుపోయాయని, ఎక్కడ పడేశారంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికే ఈ గ్రామసభల డ్రామా అంటూ దుయ్యబట్టారు.
పథకాల జాబితాలో అర్హుల పేర్లు ఉండేలా లబ్ధిదారులు గ్రామసభల్లో పట్టుబట్టాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వేముల పేర్కొన్నారు. అనేక గ్రామాల్లో లబ్ధిదారులు వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారని అన్నారు. అర్హులకు అండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ కుమార్ సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి నియోజకవర్గంలోని 31వేల మంది రైతులకు రుణమాఫీ చేయించాలని వేముల సవాల్ విసిరారు. ఎగ్గొట్టిన రైతుబంధు, మహిళలకు రూ.2,500, తులం బంగారం ఇప్పిస్తే ఆయన సిపాయి అవుతారని, కానీ తన మీద ఏడిస్తే కావన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు