బస్తా యూరియా కోసం బారులు తీరక తప్పడం లేదు. యూరియా కోసం అన్నదాత గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరి నాటింది మొదలు ఇప్పటి వరకు ఒక బస్తా కోసం నిత్యం సొసైటీలు, గోదాముల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. అదును దాటుతున్నదని, ఇప్పుడు పంటకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కర్షకులు యూరియా వేసి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం అన్నదాతకు శాపంగా మారింది.
నిజాంసాగర్/ రామారెడ్డి/ మాచారెడ్డి/ బీబీపేట/ భిక్కనూరు, సెప్టెంబర్ 10 : మహ్మద్‌నగర్ మండల కేంద్రానికి బుధవారం ఉదయం ఒక యూరియా లారీ వచ్చిన విషయం తెలుసుకున్న పలు గ్రామాల రైతన్నలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ అధికారులు ఒక రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచిచూడగా.. ఎకరం పొలం ఉన్న వారికి ఒక బస్తా, మూడెకరాలు ఉన్న వారికి రెండు బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశారు.
వరి పొట్టదశకు వస్తున్నదని, ప్రస్తుతం యూరియా అత్యవసరమని, తగినంత పంపిణీ చేయాలని రైతులు వేడుకుంటున్నారు. బీబీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి బుధవారం 880 బస్తాల యురియా వచ్చిందని సీఈవో నర్సాగౌడ్ తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఎండలో బారులు తీరారు.
రామారెడ్డితో పాటు ఉప్పల్వాయి, పోసానిపేట్, మోషంపూర్ గ్రామాల్లో బుధవారం యూరియా పంపిణీ చేస్తారని తెలియడంతో రైతులు ఉదయం ఐదు గంటలకే పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. క్యూలో చెప్పులు, రాళ్లు పెట్టారు. అధికారుల కంటే ముందే పోలీసులు వచ్చి రైతులు క్యూలో నిల్చోవాలని చెప్పడంతో రాళ్లు, చెప్పులు తీసివేశారు.
రామారెడ్డిలో 888, పోసానిపేట్‌లో 222, మోషంపూర్‌లో 222, ఉప్పల్వాయిలో 444 బస్తాల యూరియాను ఒక్కో రైతుకు ఒకటి చొప్పున అందజేశారు. రెండు బస్తాల యూరియా ఇవ్వాలని రైతులు వేడుకున్నా.. అధికారులు స్పం దించకపోవడంతో నిరాళ చెందారు. మాచారెడ్డి సొసైటీ వద్ద రెండో రోజు బుధవారం కూడా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పలేదు. సొసైటీకి 450 బస్తాల యూరియా మాత్రమే రాగా.. దాని కోసం సుమారు ఎనిమిది వందల మంది రైతులు తరలివచ్చి బారులు తీరారు. ఉదయం ఐదు గంటలకే సొసైటీ వద్దకు చేరుకోగా.. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు యూరియాను పంపిణీ చేశారు. గురువారం కోసం టోకెన్లు ఇవ్వాలని రైతులు వేడుకోగా.. అధికారులు స్పందించలేదు.