ఉమ్మడి జిల్లాలో ఒకవైపు కురుస్తున్న భారీ వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులను మరోవైపు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సొసైటీల్లో రైతులకు సరిపడా బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా పనులు వదులుకొని గోదాముల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. గంటల తరబడి క్యూలో నిల్చున్నా యూరియా దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. దీంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. మూడు రోజుల క్రితం గజ్యానాయక్‌తండా ఎక్స్‌రోడ్ వద్ద రైతులు రోడ్డెక్కారు. సొసైటీలో యూరియా కొరతను ఆసరాగా చేసుకొని ఫర్టిలైజర్ షాపు యజమానులు అధిక ధరలకు విక్రయిస్తూ అవసరం లేని మందులను అంటగడుతున్నారని మండిపడ్డారు.
-మాచారెడ్డి, ఆగస్టు 31
మాచారెడ్డి సొసైటీ పరిధిలో 36 గ్రామాలు ఉన్నా యి. ఉమ్మడి మాచారెడ్డి మండలంలో వరి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. సకాలంలో ఎరువులు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవే ట్ వ్యక్తుల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.266 లకు లభించాల్సిన యూరియా బస్తా ను బయట ఫెర్టిలైజర్ షాపుల్లో రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.
మండలంలోని ఫరీద్‌పేట, భవానీపేట, ఎల్పుగొండ, ఎల్లంపేట, సోమార్పేటతోపాటు మాచారెడ్డి గోదాంలో యూరియా అయిపోయిందని, ఆర్డర్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. సొసైటీలో లభించని ఎరువులు ప్రైవేట్ వ్యక్తులు విచ్చలవిడిగా అధిక ధరలకు ఏవిధంగా విక్రయిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఎరువులను తెప్పించాలని రైతులు కోరుతున్నారు.
440 బస్తాలు.. 8వందల మంది రైతులు
పాల్వంచ మండలంలోని ఏల్పుగొండ, భవానీపేట గ్రామాల్లో ఆదివారం 440 యూరియా బస్తాలను పంపిణీ చేశారు. దాదాపు ఎనిమిది వందల మంది రైతులు ఉదయం 5 గంటల నుంచి బారులుతీరారు. సుమారు 5 గంటలు క్యూలో నిల్చుని యూరియాత తీసుకున్నారు. సగం మంది రైతులకు కూడా యూరియా బస్తాలు లభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
బీఆర్ఎస్ హయాంలో యూరియా కొరత లేదు..
గడిచిన పదేండ్లలో యూరియా కొరత లేకుండా కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో పంపిణీ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తమ చెప్పులను వరుసలో ఉంచే పరిస్థితి తీసుకువచ్చింది. రైతుబంధుతో కేసీఆర్ ఆదుకున్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలి.
-భుక్యా నర్సింహులు, రైతు బంధు సమితి ఉమ్మడి మాచారెడ్డి మండల మాజీ కన్వీనర్