Urea available | పోతంగల్ జులై 4: మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పోతంగల్ మండల వ్యవసాయ అధికారి నిషిత అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండలంలోని సొసైటీ గోదాములలో ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని సొసైటీ గోదాములలో 56.115 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. 32.4 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉందని తెలిపారు. యూరియాను దశల అవసరం మేరకు కొనుగోలు చేయాలని, సీజన్ మొత్తానికి సరిపడా ఎరువులు ఒకేసారి కొనుగోలు చేయవద్దని సూచించారు. అనంతరం నానో యూరియా, నానో డీఏపీపై రైతులకు అవగాహన కల్పించారు. ఆమె వెంట సొసైటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.