‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..’ అంటూ ఓ సినిమాలో హీరో చెప్పే ఈ డైలాగు దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. సమాజరక్షణతోపాటు క్రమశిక్షణకు చిరునామాగా ఉండాల్సిన ‘నాలుగో సింహం’ గాడి తప్పుతున్నది. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే లంచాలకు ఎగబడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీపడి మరీ వసూళ్లకు తెగబడుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది పోలీసు అధికారులు ఏసీబీకి పట్టుబడుతుండడం..ఏ స్థాయిలో అవినీతి పెచ్చుమీరిందో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నది. తాజాగా కామారెడ్డి జిల్లా లింగంపేట ఠాణా ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం..ఆ శాఖలో కలకలం సృష్టించింది.
– నిజామాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సామాన్యులు, పేద ప్రజలు అనే తేడా లేకుండా డబ్బులే పరమావధిగా పని చేస్తున్నారు. సమాజంలో పోలీసులంటే విశిషమైన గౌరవ, మర్యాదలు దక్కుతాయి. ప్రజల మాన, ప్రాణాలను రక్షించే రక్షక భటుల్లో నిబద్ధత, నిజాయితీతో పని చేసే వారు చాలా మంది ఉన్నారు. అదే సమయంలో మరికొంత మంది అక్రమార్కులు ప్రజల సేవలో తరిస్తున్నట్లుగా నటిస్తూ సంపాదనే లక్ష్యంగా బరితెగించి పని చేస్తున్నారు. సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులు కాసుల కోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. పోలీస్ శాఖకే మాయని మచ్చను తీసుకువస్తున్నారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఈ మధ్య కాలంలో తరచూ ఎస్సైలు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కుతుండడం విస్మయానికి గురిచేస్తున్నది. పోలీస్ స్టేషన్లనే వసూళ్లకు అడ్డాగా చేసుకుంటున్న ఖాకీల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్నది. నిత్యం నీతులు చెప్పే పోలీస్ అధికారులే గాడి తప్పుతుండడంతో ప్రజల్లో విరక్తి పుడుతున్నది. పోలీస్ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ఠాణాల్లో ఎస్సైలది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. సివిల్ సెటిల్మెంట్లు, భార్యాభర్తల పంచాయితీ, ఇతర దందాల్లో ప్రత్యక్షంగా పాత్రధారులుగా నిలుస్తూ స్టేషన్లను అవినీతికి అడ్డాగా మార్చుతున్నారు.
అవినీతి ఠాణా లింగంపేట…
లింగంపేట పోలీస్ స్టేషన్ అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడ పని చేస్తున్న పోలీసులకు ఈ ఠాణా కల్పతరువుగా మారింది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పని చేస్తున్న ఎస్సైలు అవినీతి కేసుల్లో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడం సంచలనంగా మారింది. ఎస్సైల అవినీతి బాగోతాన్ని అవినీతి నిరోధక శాఖ బట్టబయలు చేస్తుండడంతో లింగంపేట పీఎస్ పరువు మంటగలుస్తున్నది. మెదక్ జిల్లాకు సరిహద్దుగా ఉన్న లింగంపేట అటవీ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువే. కలప, గంజాయి అక్రమ రవాణా, జంతువుల వేట సాగిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎస్సైగా పని చేయాలంటే సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. అలాంటి పోలీస్ స్టేషన్‌కు హౌస్ ఆఫీసర్లుగా వస్తున్న ఎస్సైలు కేవలం కాసుల కోసం కక్కుర్తిపడుతున్నారు. నవంబర్ 14న రూ.20వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై అరుణ్ కుమార్, రైటర్ రామస్వామి ఇద్దరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం డబ్పులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి లంచగొండి పోలీస్ అధికారిని కటకటాలకు పంపించాడు. ఎస్సై అరుణ్ స్థానంలో ఎస్సై సుధాకర్ వచ్చి రాగానే వసూళ్లకే పాల్పడినట్లు ప్రచా రం జరుగుతున్నది. ఇదే కోవలో ఓ వాహన విక్రయదారుడి నుంచి బుధవారం రూ.12,500 తీసుకుంటూ నిజామాబాద్‌లో ఏసీబీకి చిక్కడంతో అవినీతి బట్టబయలైంది. రెండున్నర నెలల వ్యవధిలోనే ఒకే ఠాణాలో ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి లంచం తీసుకుంటూ చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పదేండ్ల కాలంలో లింగంపేట ఠాణాలో ఎస్సైలు ఏసీబీకి చిక్కడం ఇదీ నాలుగో కేసు కావడం గమనార్హం. కామారెడ్డి పోలీస్ శాఖలో లింగంపేట తరహాలోనే వసూళ్ల పర్వం సర్వత్రా నెలకొన్నది. ఆరోపణలు వస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఏసీబీకి చిక్కి ఖాకీల పరువును బజారున పడేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గాడి తప్పిన పోలీస్ కమిషనరేట్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఇన్చార్జి సీపీగా కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ ఉన్నప్పటికీ రెగ్యులర్ సీపీ లేకపోవడంతో కింది స్థాయిలో ఇష్టారాజ్యం నడుస్తున్నది. సీపీగా కల్మేశ్వర్ సింగెనవార్ ఉన్నప్పుడు కొంతకాలం అక్రమాలకు తావు లేకుండా కనిపించింది. కొంత మంది నాటి సీపీకి తప్పుడు సమాచారాన్ని అందించి తప్పటడుగులు వేయించినప్పటికీ కింది స్థాయిలో ఎస్సై, సీఐ, ఏసీపీలంతా కల్మేశ్వర్ చెంత పని చేసేందుకు వణికి పోయారు. ఆయన బదిలీతో ఇప్పుడంతా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నవంబర్ 8, 2024లో వర్ని ఎస్సై కృష్ణ సైతం లంచం తీసుకుంటూ పోలీస్ స్టేషన్లోనే ఏసీబీకి దొరికాడు.
ఇసుక మామూళ్లలో 12 మంది ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలంటూ నాలుగు నెలల క్రితమే డీజీపీ ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ ఇసుక అక్రమాలు ఆగలేదు. ఖద్దర్ నేతలతో కలిసి పలువురు ఖాకీలు చెట్టాపట్టాలేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీపీగా ఈ మధ్యే ప్రమోషన్ పొందిన బస్వారెడ్డి నేరుగా నిజామాబాద్‌లోనే పోస్టింగ్ దక్కించుకుని అదనపు డీసీపీగా కొనసాగుతున్నారు. సీపీ లేకపోవడంతో ఆయనే కీలకంగా మారారు. సీపీ సీటు ఖాళీ ఏర్పడి నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం కొత్త వారిని నియమించడం లేదు. దీంతో పాలన గాడి తప్పుతున్నది. నిజామాబాద్ నగరంలో ఆయా టౌన్లలో ఫిర్యాదుల వరకే పలు కేసులు పరిమితమవుతున్నాయి. ఎఫ్ఐఆర్ కాక మునుపే సెటిల్మెంట్లతో పలువురు ఎస్సైలు జేబులు నింపుకొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏసీబీకి చిక్కిన లింగంపేట ఎస్సై
వినాయక్‌నగర్/ లింగంపేట, జనవరి 29: లింగంపేట ఎస్సై సుధాకర్ ఏసీబీ వలకు చిక్కాడు. ద్విచక్ర వాహనాలను విక్రయించే ఓ వ్యక్తి నుంచి బుధవా రం రూ.12, 500 లం చం తీసుకుం టూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డా డు. నిజామాబాద్ ఏసీ బీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన మేరకు వివరాలు.. లింగంపేట్‌కు చెందిన నగేశ్ తన కారును అదే ఏరియాకు చెందిన మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ కారును మూడో వ్యక్తిగా నిజామాబాద్ మండలంలోని బోర్గాం(పీ) వద్ద ఉన్న కారు బజార్ నిర్వాహకుడు స్వామి కొనుగోలు చేశా డు. స్వామి ఆ కారును చిరంజీవి అనే వ్యక్తికి విక్రయించాడు. లోన్ ద్వారా తీసుకున్న ఆ కారు మొత్తం నలుగురు వ్యక్తుల చేతులు మారినప్పటికీ లోన్ డబ్బులు ముట్టకపోవడంతో రిజిస్ట్రేషన్ కాలేదు. కారును కొనుగోలు చేసిన చిరంజీవి లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో కారు మొదటి యజమాని రాజేశ్‌కు నోటీసులు వచ్చాయి.
దీంతో అతడు లింగంపేట ఎస్సై సుధాకర్‌కు ఫిర్యాదు చేశాడు. సదరు ఎస్సై కార్ బజార్ నిర్వాహకుడు స్వామికి ఫోన్ చేసి, నీపై ఫిర్యాదు వచ్చిందని, కేసు కాకుండా ఉండడానికి రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కార్ బజార్ నిరాహకుడు రూ.12, 500 ఇస్తానని ఎస్సైతో ఒప్పందం కుదుర్చుకొని, ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం సెలవుపై ఎస్సై సుధాకర్ నిజామాబాద్‌కు వచ్చాడు. స్వామికి ఫోన్ చేసి, తాను వినాయక్‌నగర్‌లోని హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్నానని, డబ్బులు తీసుకురావాలంటూ చెప్పాడు. దీంతో స్వామి హనుమాన్ జంక్షన్ వద్ద కారులో కూర్చొని ఉన్న ఎస్సై సుధాకర్‌కు రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎస్సైని నాల్గో టౌన్‌కు తరలించి,కేసు నమోదు చేశారు.