నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 19 : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. గురువారం ఆర్మూర్, జక్రాన్‌పల్లి, రెంజల్, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, నందిపేట్, ముప్కాల్, బాన్సువాడ, బీబీపేట్ తదితర మండలాల్లో అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు.
నందిపేట్‌లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంవల్లే భారత్‌కు ప్రజాస్వామిక దేశంగా ప్రపంచదేశాల్లో గుర్తింపు వచ్చిందన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడిన అమిత్‌షా వెంటనే తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని భరతజాతికి క్షమాపణలు చెప్పాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.