నిజామాబాద్, ఆగస్టు 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళామణులకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటోన్న ఈ పథకంలో నిత్యం ఆడవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు బస్సులు సమయానికి రాక, సరిపడా బస్సులు లేక చతికిల బడుతున్నారు. చిన్నా, పెద్దా అంతా బస్టాండ్‌లో నిరీక్షణకు సమయం వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
ఇదిలా ఉండగా దినదినం నరకప్రాయంగా మారిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఆధార్ కిరికిరి మరింత ఇరకాటానికి గురి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మహిళలకు పాత కార్డులే ఉన్నాయి. కొత్తగా చాలా మంది వివరాలు అప్ డేట్ చేసుకోవడం, వేలి ముద్రలు కొత్తవి ఇచ్చినప్పటికీ ఆధార్ కార్డులో చిరునామాలో మాత్రం మార్పులు జరగడం లేదు.
అప్డేట్లో కేవలం భౌతికపరమైన మార్పులు, చేర్పులు మాత్రమే స్వీకరిస్తుండగా చిరునామాలో ఉమ్మడి రాష్ట్రం పేరు స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది పెట్టడం లేదు. దీంతో కొత్త కార్డు చేత పట్టుకుని బస్సు ఎక్కితే వారికి కష్టాలు మొదలవుతున్నాయి. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కువగా నిజామాబాద్ రీజియన్‌లోనే జరుగుతున్నాయి. తరచూ బస్సులో నుంచి మహిళలను దించేస్తుండటంతో మహిళలంతా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
భైంసా బస్సులో రభసా…
నిజామాబాద్ డిపో 1కు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సులో నుంచి మార్గమధ్యలో ఐదారుగురు మహిళలను కండక్టర్ దించేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్ధాక్షిణ్యంగా వారిని రోడ్డున పడేసి ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది వాగ్వాదం పెట్టుకుంటున్న వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. కనీసం వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
కాకపోతే సదరు బాధిత మహిళలు వెల్లడించిన వివరాల ప్రకారం వారి ఆధార్ కార్డులు ఒరిజినల్. అయితే అందులో చిరునామాలో రాష్ట్రం పేరు ఉన్న చోట ఆంధ్రప్రదేశ్ అని ఉండటమే కారణం. బాధితులు అంతా నిజామాబాద్ జిల్లా వాసులే. ఆధార్ కార్డులో గ్రామం, మండలం, జిల్లా పేరు అన్నీ తెలంగాణ రాష్ట్రంలోనివే ఉన్నాయి. కాకపోతే ఆధార్ కార్డులో ఉమ్మడి రాష్ట్రంలో తొలుత ఆధార్ కార్డు స్వీకరించినప్పుడు నమోదైన వివరాలే తిరిగి ప్రింట్ అయ్యాయి.
దీంతో అమాయక ప్రజలంతా ఆర్టీసీ సిబ్బంది చేత చివాట్లకు గురవుతున్నారు. ఆధార్ కార్డు చెల్లుబాటు కాదంటూ కండక్టర్లు దించేస్తున్న ఘటనలతో ప్రభుత్వంపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెబుతున్న మాటలకు నిజామాబాద్ రీజియన్‌లో అధికారుల తీరుకు పొంతన ఉండటం లేదు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారిని గౌరవంగా సంభోధించాలంటూ పదే పదే చెబుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
స్పందించని ఆర్టీసీ అధికారులు..
భైంసా బస్సులో వెలుగు చూసిన అమానవీయ వ్యవహారంపై బాధిత మహిళల ద్వారా కొంత మంది వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు ఫోన్లు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆర్టీసీ డిపో 1 మేనేజర్‌కు ఫోన్లు చేయగా వారు స్పందించకపోవడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఫోన్ ఎత్తి సమాధానం ఇచ్చి ఉంటే ఆర్టీసీ పరువు కాసింత నిలబడేది. అధికారుల తీరు వల్ల ఆర్టీసీ పరువు సోషల్ మీడియాలో బజారున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డుతో ఇక్కట్లు ఎదురవుతుండటంపై ఆర్టీసీ యాజమాన్యం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ కార్డుతో పాటుగా ఓటర్ ఐడీని సైతం కండక్టర్లు, డ్రైవర్లు అనుమతిస్తారని ఎండీ సజ్జనార్ గతంలోనే బహిరంగంగానే ప్రకటన చేశారు. ఎండీ మాటలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదు. అవగాహన లేమి మూలంగా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆధార్ కార్డు బదులుగా ఓటర్ ఐడీ చూపితే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుందనే విషయంపై ప్రచారం చేయడం లేదు. దీంతో మహిళలంతా తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఆధార్ చిక్కులకు మరోసారి చిరునామా అప్డేట్ చేసుకోవడమే ఉత్తమమని అధికారులు చెబుతున్నారు.
ఐదు కార్డులతో ఉచిత ప్రయాణం…
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డుతో పాటుగా ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం నుంచి జారీ చేయబడిన రెసిడెన్షియల్ అడ్రస్‌తో కూడిన గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. డైరెక్టర్ ఆఫ్ డిసబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ నుంచి జారీ చేసిన గుర్తింపు కార్డు సైతం ఆమోద యోగ్యమే. మా సిబ్బందికి వీటిపైనా అవగాహన కల్పిస్తాము. ప్రయాణికులు సైతం ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాము.
– మధుసూదన్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, ఆర్టీసీ