మాచారెడ్డి,ఆగస్టు 29 : కామారెడ్డి నియోజకవర్గంలో పల్లెలన్నీ కేసీఆర్‌కు వెన్నంటి ఉంటామని తీర్మానిస్తున్నాయి. ఇప్పటికే 16 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేయగా మంగళవారం పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామంలో 10 కుల సంఘాలు కేసీఆర్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు తీర్మాన ప్రతులను ఎంపీపీ, జడ్పీటీసీలకు అందజేశారు. ఈ సందర్భంగా కుల సంఘాల నాయకులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ‘సారే రావాలి.. కారే గెలవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో తీర్మానాల జోరు కొనసాగుతుండడంతో పండుగ వాతావరణం నెలకొంటున్నది.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత ప్రకటించినప్పటి నుంచి మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి. నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. సీఎం కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సారే రావాలి…కారే గెలవాలి అనే పట్టుదలతో కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి.
ఇప్పటికే 16 గ్రామాల్లో
ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, నడిమితండా, నెమ్లిగుట్టతండా, బోడగుట్టతండా, అంకిరెడ్డిపల్లితండా, మైసమ్మ చెరువు తండా, గుంటితండా, ఒడ్డెరగూడెం తండా, రాజ్‌ఖాన్‌పేట, మంథనిదేవునిపల్లిలో ఇప్పటికే తీర్మానించగా ఆరెపల్లి గ్రామంలో పది కుల సంఘాలు ఏలేటి వారి, గడ్డంవారి , వెలమ, పద్మశాలీ, ముదిరాజ్, ఎస్సీ, గొల్ల, కుర్మ, గౌడ, యూత్ సంఘాలతో పాటు లక్ష్మీరావులపల్లి గ్రామంలో మెజారిటీగా ఉన్న ముదిరాజ్ కులస్తులు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామంటూ తీర్మాన ప్రతులను ఎంపీపీ నర్సింగ్‌రావు, జడ్పీటీసీ రాంరెడ్డికి అందజేశారు. ప్రతులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందజేయనున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో స్వచ్ఛందంగా ర్యాలీలు
ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని 16 గ్రామాల్లో తీర్మాన ప్రతులతో ఆయా కులసంఘాలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామంలో పార్టీలకతీతంగా కుల సంఘల నాయకులు ర్యాలీ తీశారు. జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇతర ఏ పార్టీకి ఓటేయ్యబోమని ముక్తకంఠంతో నినదించారు.
ప్రతి పక్షాల అడ్రస్ గల్లంతే..
ఉమ్మడి మాచారెడ్డి మండలంలో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూస్తే ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. కనీసం డిపాజిట్లు కూడా రాకుండా గంపగుత్తాగా సీఎం కేసీఆర్‌కు ఓటు వేసి కామారెడ్డి నుంచి భారీ మెజారిటీ సాధించి చరిత్ర సృష్టిస్తామని అంటున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వాటిని బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యం తిప్పి కొడుతున్నది.
గ్రామగ్రామాన సీఎం కేసీఆర్‌కు మద్దతు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో తీర్మానాల జోరు కొనసాగుతున్నది. దేశంలో ఏ నాయకుడికి లభించని విధంగా కేసీఆర్ కు తీర్మానాలతో స్వాగతం పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం తమ ప్రాంతానికి దక్కిన అరుదైన గౌరవమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల కన్నా రెట్టింపు అభివృద్ధి ఇక్కడ జరగబోతుందని ఆకాంక్షిస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగారెడ్డి, ఎంపీటీసీ విజయ, పగడాల బాల్‌చంద్రం, గంగారెడ్డి, కాశీరెడ్డి, నర్సింహారెడ్డి, రాజాగౌడ్, మద్దెల రాజు, షేఖ్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
గొర్రెల పంపిణీ ద్వారా లబ్ధి పొందాం
సీఎం కేసీఆర్ సార్ మొట్టమొదటి సారిగా మా గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాకు యూనిట్ అందించా రు. వాటి ద్వారా నేను ఎంతో లబ్ధి పొందాను. సీఎం కేసీఆర్ సార్‌ను కామారెడ్డి నుంచి గెలింపించుకుంటే ఇంకా ఎంతోమంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుంది.
-ఎర్రగొల్ల పెద్దసాయిలు, ఆరెపల్లి, పాల్వంచ మండలం
గతంలో ఎవ్వరూ ఇంత పెన్షన్ ఇవ్వలేదు..
కేసీఆర్ సార్ ఇస్తున్నంత పెన్షన్ గతంలో ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు వేరే పార్టీవాళ్లు కేసీఆర్ కన్నా ఎక్కువగా ఇస్తామని అంటున్నారు. మరి గతంలో ఎందుకు ఇయ్యలేదు. రూ.200 నుంచి రూ. రెండు వేలు ఇస్తున్న కేసీఆర్‌ను తప్ప వేరే వాళ్లను నమ్మం. సార్కే ఓటు వేసి గెలిపించుకుంటాం.
-గ్యార లింగం,ఆరెపల్లి,పాల్వంచ మండలం
రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు
రైతులను కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవుడు సీఎం కేసీఆర్. దేశంలో ఏ రాష్ర్టాల్లో కూడా రైతుల కోసం ఇక్కడ అమలవుతున్న పథకాలు లేవు. రైతుబంధు, రైతుబీమాతో పాటు రుణమాఫీ చేశారు. రైతులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది. మా గ్రామంలో రైతులందరం సీఎం సార్‌ను ఇక్కడి నుంచి భారీ మెజారిటీ తో గెలిపించేందుకు సిద్ధమయ్యాం.
-ఇంకాయల పెద్ద నర్సారెడ్డి,ఆరెపల్లి,పాల్వంచ మండలం