జక్రాన్‌పల్లి, మే 2 : ఎంసెట్ రాసి తిరిగి కారులో వస్తుండగా జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెలు మృత్యువాత పడ్డారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. మృతులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. జక్రాన్‌పల్లి ఎస్సై రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బానోవత్ అశ్విని (19), బానోవత్ మంజుల(17) అక్కచెల్లెళ్లు. వీరు హైదరాబాద్‌లో ఎంసెట్ రాయడానికి కారులో వెళ్లారు.
పరీక్ష రాసి తిరిగి కారులో వస్తుండగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశ్విని, మంజుల ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ జాదవర్ హంసరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంవల్లే కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు.