కామారెడ్డి, జూన్ 4: భిక్షాటన చేసేందుకు రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లాకేంద్రంలోని కామారెడ్డి పోలీసుస్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి వెల్లడించారు.
జిల్లాలోని భిక్కనూరుకు చెందిన మక్కాల నర్సింహులు.. భార్య, కుమారుడు హర్షిత్ (2)తో కలిసి కామారెడ్డిలోని సిరిసిల్లా రోడ్లో ఉన్న ఒక ఫాస్ట్ఫుడ్ సెంటర్ వద్ద మంగళవారం రాత్రి నిద్రించా రు. అర్ధరాత్రి నిద్ర లేచి చూడగా.. తమతో పడుకున్న బాలుడు కనిపించలేదు. దీంతో వెంటనే పట్ట ణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పట్టణ సీఐ చం ద్రశేఖర్రెడ్డి, ఎస్సై శ్రీరామ్, సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
వారు పడుకున్న పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఒక మహిళ, పురుషుడు బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వారు కామారెడ్డి రైల్వేస్టేషన్లో బాలుడితో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. దోమకొండకు చెందిన పల్లపు రాజు, పల్లపు శారద చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిల్లోనే కేసును ఛేదించిన పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై శ్రీరామ్, కానిస్టేబుళ్లు విశ్వనాథ్, విజయ్, రాజు,నరేశ్, రవి, అశ్వినిని ఏఎస్పీ అభినందించారు.