నందిపేట్/ ఆర్మూర్ టౌన్, ఏప్రిల్ 12 : చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు (బావ, బావమరిది) మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని సిద్ధాపూర్ గ్రామశివారులో చోటుచేసుకున్నది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా (46) ఇంటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన అతడి బావమరిది మహ్మద్ రఫీక్(47) రంజాన్ పండుగ కోసం వచ్చాడు.
ఇద్దరూ కలిసి సరదాగా చేపల వేట కోసం నందిపేట మండలంలోని సిద్ధా పూర్ గ్రామశివారులో అమ్దాపూర్ రోడ్డు పక్కన ఉన్న మునికుంటకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ముందుగా మహ్మద్ రఫీక్ చేపలు పడుతుండగా కాలు జారి కుంటలో పడిపోగా.. అతడిని రక్షించేందుకు షేక్ షాదుల్లా ప్రయత్నించగా ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఇద్దరికీ అంతంత మాత్రమే ఈత రావడంతో మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటికి తీయించారు. మృతుడు షేక్ షాదుల్లా కుమారుడు సులేమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.