నిజామాబాద్, డిసెంబర్ 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ పనితీరు హాస్యాస్పదంగా మారుతోంది. తనిఖీలు చేపట్టకుండానే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆఫీస్‌లకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ నిర్వహిస్తోన్న సమీక్షలు, సమావేశాలకు హాజరవ్వడం మినహా క్షేత్ర స్థాయి లో మెడికల్ షాపులను తనిఖీలు చేపట్టిందేమీ లేదని తెలుస్తోంది. తద్వారా ఔషధ దుకాణాల్లో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు పని చేస్తున్నారు.
నిజామాబాద్ అర్బన్‌కు ఒకరు, నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాలకు మరో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. వీరు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం సైతం పదే పదే ఈ అంశంపై నొక్కి చెబుతున్నప్పటికీ డ్రగ్స్ కంట్రోల్ శాఖలో పని చేస్తున్న వారికి మాత్రం ఇవేవీ పట్టడం లేదు. నిజామాబాద్ నగరంలో మెడికల్ దుకాణాల తీరు ఇష్టారాజ్యంగా మారింది. పుట్టగొడుగుల్లా వెలిసిన మెడికల్ షాపుల్లో నిపుణులే కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మెడికల్ షాపులు నడుస్తున్నాయి. ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. “మామూలు”గానే వదిలేస్తున్నారా? లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న చర్చ సర్వత్రా నడుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో గుర్తింపు కలిగిన ఔషధ దుకామాలు దాదాపుగా 1800 వరకు ఉన్నాయి. ఇందులో 1400 వరకు రిటైల్ దుకాణాలు(మెడికల్ షాపులు), 300 నుంచి 400 వరకు మెడికల్ ఏజెన్సీలున్నాయి. ప్రతి నెలా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈ మెడికల్ షాపులను పర్యవేక్షణ చేస్తూ ఔషధ నమూనాలను సేకరించాలి. శాంపూల్స్ను హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించాలి. వాటిలో నాణ్యతను నిగ్గుతేల్చాలి. నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రక్రియ పకడ్భందీగా సాగడం లేదు. శాంపిల్స్ తూతూ మంత్రంగా సేకరిస్తున్నట్లుగా తెలిసింది. ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
సాధారణ తనిఖీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఔషధ దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, దుకాణాల్లో వసతులను తనిఖీ చేశాకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్న దుకాణాలు గుర్తింపు పునరుద్ధరణ కూడా చూసుకోవాలి. ఆయా దుకాణాలను పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులతో సత్సంబంధాల మూలంగా ఇదంతా మామూళ్ల వ్యవహారంగానే నడుస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. పలు ఔషధ దుకాణాల్లో ఫిజీషియన్ శాంపిళ్లు, అనుమతి లేని మందులను సైతం విక్రయించుకుని వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ముమ్మర తనిఖీలు చేస్తే మెడికల్ షాపుల్లో నకిలీ మందులు సైతం వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ మధ్య కాలంలో నకిలీ డాక్టర్లు, అనుమతి లేని ఆసుపత్రుల తీరును చూశాం. అచ్చంగా మెడికల్ షాపులు సైతం రాజ్యమేలుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి తోడుగా ఔషధ నియంత్రణ శాఖ నిర్లీప్తత వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో దీపంలా మారింది. నిజామాబాద్ గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే మెడికల్ దుకాణాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఆర్ఎంపీ, పీఎంపీల చేతుల్లోనే ఔషధాల క్రయ, విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. గ్రామాల్లో నడి రోడ్లపై మెడికల్ దుకాణాల బోర్డులు పెట్టుకుని మరీ నడిపిస్తున్నారు. ఎవ్వరూ అడిగే వారు లేకపోవడం వీరి వ్యాపారం జోరుగా నడుస్తోంది.
కాసులకు కక్కుర్తి పడుతోన్న మెడికల్ ఏజెన్సీలు సైతం ఇష్టారాజ్యంగా అనధికారిక వ్యక్తులకు ఔషధాలను సరఫరా చేస్తూ డబ్బులు దండుకుంటున్నాయి. గ్రామాల్లో నడిచే అనధికారిక మెడికల్ షాపుల్లో అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఎమ్మార్పీ ధరలను మార్చేసి అమ్మకాలు జరుపుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగ లేబుళ్లతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే దిక్కు లేడు. ఆసుపత్రులకు అనుబంధంగా కొనసాగే మెడికల్ షాపుల్లో మరింత ఘోరంగా పరిస్థితి మారింది. ఔషధ దుకాణాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారినప్పటికీ ఔషధ నియంత్రణ శాఖ అధికారులెవ్వరూ పట్టనట్లు ఉండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి టూర్లకు వెళ్తే ఈ తతంగం భారీగా వెలుగూ చూసే అవకాశం ఉండగా ఆ పరిస్థితి కానరావడం లేదు.