రామారెడ్డి, ఆగస్టు 25: జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఇటీవల విషజ్వరంతో ఓ విద్యార్థి మృతిచెందగా.. శనివారం అదే గ్రామానికి చెందిన మరో బాలిక మృతి చెందింది. పదిరోజుల్లో ఇద్దరు మృతిచెందగా.. దీనిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం ‘విషజ్వరాల పంజా..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ స్పందించారు.
ఆదివారం భూంపల్లి గ్రామానికి చేరుకొని మృతిచెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గ్రామంలో వైద్య సిబ్బందితో కలిసి పర్యటించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సోమవారం నుంచి వారంరోజులపాటు ఆరోగ్యశిబిరం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ అర్హత ఉన్న వైద్యులను సంప్రదించాలని, ఆర్ఎంపీల వద్దకు వెళ్లవద్దని సూచించారు. డీఎంహెచ్వో వెంట జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆస్మా, జలపతి,నాగరాజు, ఏఎన్ఎం లలిత తదితరులు ఉన్నారు.