కామారెడ్డి, ఫిబ్రవరి 25 : కామారెడ్డి పట్టణం లో విషాదం నెలకొన్నది. మున్సిపల్ పరిధిలోని రామేశ్వర్పల్లిలో ఇద్దరు చిన్నారులు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి కుంటలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన జగన్నాథం నాగరాజు కుమారుడు శివ(10), గ్రీన్‌సిటీ కాలనీకి చెందిన కుంభ నాగేంద్రబాబు పెద్ద కుమారుడు సంతోష్(8) చేపలు పట్టడానికి సైకిల్‌పై ఆడుకుంటూ వెళ్లారు.
ఈ క్రమంలో రామేశ్వర్‌పల్లిలోని ఓ నీటి కుంటలో ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతి చెందారు. కాలనీవాసుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటికి తీయించారు. మృతదేహాలను చూసి కుటుం బ సభ్యులు బోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందిరానగర్ కాలనీకి చెందిన జగన్నాథం నాగరాజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగరాజు పెద్ద కుమారుడు శివ. గ్రీన్‌సిటీ కాలనీకి చెందిన కుంభ నాగేంద్ర బాబు కూలి పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఒక పాప, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్. మంగళవారం శివ, సంతోష్ కలిసి చేపలు పట్టడానికి సైకిల్‌పై వెళ్లి మృత్యువాత పడడంతో రెండు కుటుంబాల రోదనలు మిన్నంటాయి. చిన్నారుల మృతితో రెండు కాలనీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.