మోర్తాడ్, జూలై 7 : కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి పొ లాలకు నీటిని అందించాలని, లేదంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంతో వచ్చే కృత్రిమ కరువుకు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మోటర్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలని తాము అడిగితే, కుంగిన బ్యారేజ్ నుంచి ఎత్తిపోయాలా అని ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. కుంగింది బ్యారేజీ కాదని, ఉత్తమ్‌రెడ్డి బ్రెయిన్ అని విమర్శించారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగితే ఆయన బ్రెయిన్ మాత్రం మొత్తం కుంగినట్లున్నదని ఎద్దేవా చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి నీళ్లు ఎత్తిపోయాలని అడిగితే ,ఈ విషయంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీరు మాత్రం బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు ఉన్నదని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. అసలు బ్యారేజీకి, మోటర్లు ఆన్ చేయడానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి విషయపరిజ్ఞానం లేకుండా మాట్లాడి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మినీమం డ్రా లెవల్ 93.5మీటర్లు అయితే 96 మీటర్ల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని, మోటర్లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.
కల్వకుర్తి విషయంలో మంత్రి విడుదల చేసిన ప్రెస్‌నోట్ లోనే సమాధానం ఉన్నదనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నీటినిల్వల ఆధారంగా ఒక్కో ఏడాది ఒక్కో తేదీన లిప్టులు ఆన్చేస్తుంటారని, మే 30న శ్రీశైలం వరద వస్తే ఇప్పటివరకు కల్వకుర్తి మోటర్లు ఎందుకు ఆన్ చేయలేదని, వరదరూపంలో నీళ్లు కిందికి తరలివెళ్తుంటే జూలై, ఆగస్టు అంటూ ముహుర్తాల కోసం ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా…మొద్దునిద్ర వీడి కేసీఆర్ డిమాండ్ చేసినట్లు మోటర్లు ఆన్‌చేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని రైతుల మంచికోసమని గుర్తించకుండా మళ్లీ అవే బురదరాజకీయాలు మాట్లాడుతున్నారని వే ముల మండిపడ్డారు. 283 మెట్రిక్‌టన్నుల ధాన్యం పండించిన రికార్డు ఎలా సాధ్యమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. కాం గ్రెస్ పార్టీ 19నెలల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కట్టారా! ఒక్క చెక్‌డ్యాం నిర్మించారా! ఒక్క చెరువు పూడిక తీశారా! కొత్తగా ఒక్క ఎకారానికి నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్ లింక్ సిస్టమ్‌తోనే రిజర్వాయర్లు నిండాయని, చెక్‌డ్యాంలు నిండి మత్తళ్లు దుంకాయని, చెరువులు నిండుకుండల్లా మా రాయని, భూగర్భజలాలు పెరిగాయని, పొ లాలకు నీళ్లందాయన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇంత చేసిన బీఆర్ఎస్ ఘనతను కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకుం టూ తిరగడం తప్ప, చేసిందేమీలేదన్నారు.